Caste Census: కులగణన చారిత్రాత్మక నిర్ణయం
ABN, Publish Date - May 01 , 2025 | 04:55 AM
ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కలలో కులగణన చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనాలు కలగబోతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వండి
ఇది మోదీ సర్కార్ ఘనతే..
రాష్ట్ర ప్రభుత్వ సర్వే అంతా తప్పుల తడక
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల
న్యూఢిల్లీ,/ హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల, లక్ష్మణ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కుల సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు దీనికి సహకరించాలని వారు విజప్తి చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా జనాభా వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఏ కులానికి నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ల అమలులో న్యాయం జరుగుతుందని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ విజయమంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకి అని, ఆ పార్టీ ఏనాడూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుల తడక అని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. దేశంలో 94 ఏళ్ల తర్వాత మోదీ ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం పారదర్శక పాలనకు నిదర్శనమని లక్ష్మణ్ కొనియాడారు. దేశాన్ని 48 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బీజేపీ 2014లో ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసిందని, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 గురు మైనారిటీలకు స్థానం కల్పించిందని చెప్పారు.
ప్రధానికి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి
కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయా రాష్ట్రాలు కులగణన పేరుతో వారికి అనుకూలంగా సర్వేలు చేపట్టి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ తరుణంలో ప్రజాభిప్రాయం మేరకు, సామాజిక సామరస్యతను దృష్టిలో ఉంచుకుని జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన జనాభా లెక్కలకు గాను దాదాపు రూ.5 వేల కోట్లు వెచ్చించిందని, అయినా ఆ సర్వే అంతా తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అప్పటి సర్వే పూర్తి వివరాలను కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 05:01 AM