Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..
ABN, Publish Date - May 15 , 2025 | 09:01 AM
Astrologer Cheated Woman: తన శరీరంలో నిజంగానే ఆత్మలు ఉన్నాయని ఆమె భావించింది. జ్యోతిష్యుడు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది. తన జాతకం, ఫొటోలను అతడికి పంపించింది. మొదట 151 రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత ఏకంగా లక్ష రూపాయలు పంపింది.
21వ శతాబ్దంలోనూ ప్రజల్లో మూఢనమ్మకాలు ఇంకా చావలేదు. ఆఖరికి చదువుకున్న వారు కూడా మూఢ నమ్మకాలను ఫాలో అవుతున్నారు. మోసగాళ్ల చేతిలో దెబ్బ తింటున్నారు. తాజాగా, ఓ మహిళ కడుపు నొప్పి సమస్య తగ్గించుకునే నేపథ్యంలో పెద్ద మోసానికి గురైంది. లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఆమె శరీరంలో ఆత్మలు ఉన్నాయంటూ ఓ జ్యోతిష్యుడు నమ్మించి ముంచేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని విభూదిపుర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విభూదిపుర్‌కు చెందిన ఓ మహిళ 2023లో జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉండేది.
ఆమె చేతులు, కాళ్లు కూడా వాచిపోయాయి. ఈ విషయాన్ని ఆమె తన స్నేహితురాలికి చెప్పింది. ఆ స్నేహితురాలు ఓ జ్యోతిష్యుడ్ని సంప్రదించింది. సదరు మహిళ శరీరంలో ఆత్మలు ఉన్నాయని, 15 ఆత్మలు వెంటాడుతున్నాయని అతడు చెప్పాడు. దుష్ట శక్తుల్ని దూరం చేయడానికి పూజ చేయాలని అన్నాడు. ఈ విషయాన్ని స్నేహితురాలు బాధిత మహిళకు చెప్పింది. తన శరీరంలో నిజంగానే ఆత్మలు ఉన్నాయని ఆమె భావించింది. జ్యోతిష్యుడు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుంది. తన జాతకం, ఫొటోలను అతడికి పంపించింది. మొదట 151 రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత ఏకంగా లక్షరూపాయలు ఇచ్చింది.
కొన్ని రోజుల తర్వాత నాలుగు లక్షల రూపాయలు పంపింది. 2024, సెప్టెంబర్ 9వ తేదీన కోరమంగలలోని ఓ హోటల్‌లో పూజలు జరిగాయి. ఆ పూజలో బాధితురాలు కూడా పాల్గొంది. పూజ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తాను మోసపోయానని భావించిన ఆ మహిళ జ్యోతిష్యుడికి ఫోన్ చేసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతడు డబ్బులు ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఆమె నుంచి తప్పించుకుని తిరగసాగాడు. జ్యోతిష్యుడి ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
Hair Transplant Horror: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దారుణం.. మరో ఇంజనీర్ బలి..
Updated Date - May 15 , 2025 | 09:01 AM