Artificial Intelligence: ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నీళ్లు!
ABN, Publish Date - May 29 , 2025 | 05:35 AM
కృత్రిమ మేధ దెబ్బకు ఉద్యోగాలు భారీగా పోతాయని అంతా ముందు నుంచీ ఊహిస్తున్నదే. కానీ.. ఏ స్థాయిలో? అని ప్రశ్నిస్తే.. అంచనాలే తప్ప వాస్తవ గణాంకాలేవీ అందుబాటులో లేవు.
కృత్రిమమేధతో తగ్గుతున్న కొత్త పట్టభద్రుల నియామకాలు
2019తో పోలిస్తే 2024కి 50 శాతానికి పైగా తగ్గుదల
దిగ్గజ కంపెనీల్లో 15 ు నుంచి 7 శాతానికి తగ్గుముఖం
స్టార్టప్ సంస్థల్లో ఏకంగా 30 శాతం నుంచి 6 శాతానికి
ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం బోలెడు కొలువులు
వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సిగ్నల్‌ఫైర్’ నివేదిక
న్యూఢిల్లీ, మే 28: కృత్రిమ మేధ దెబ్బకు ఉద్యోగాలు భారీగా పోతాయని అంతా ముందు నుంచీ ఊహిస్తున్నదే. కానీ.. ఏ స్థాయిలో? అని ప్రశ్నిస్తే.. అంచనాలే తప్ప వాస్తవ గణాంకాలేవీ అందుబాటులో లేవు. తాజాగా ‘సిగ్నల్‌ఫైర్’ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆ గణాంకాలను వెల్లడించింది. 2019తో పోలిస్తే.. పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో ఫ్రెషర్స్ నియామకాలు 2024 నాటికి 50 శాతానికిపైగా తగ్గిపోయినట్టు ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ఒకప్పుడు దిగ్గజ టెక్ సంస్థల్లో ఏటా జరిపే నియామకాల్లో 15ు దాకా అప్పుడే డిగ్రీ/పీజీ పూర్తిచేసిన యువత ఉండేవారని.. ఇప్పుడు వారి వాటా 7 శాతానికి తగ్గిపోయిందని సిగ్నల్‌ఫైర్ వెల్లడించింది. స్టార్ట్‌పలలో వీరి వాటా 2019 నాటికి 30 శాతానికిపైగా ఉండేదని.. 2023 నాటికి 11 శా తానికి, 2024 నాటికి 6 శాతానికి తగ్గిపోయినట్టు వివరించింది. ప్రపంచంలోనే టాప్-7 కంపెనీలుగా పేరున్న అల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), అమెజాన్, యాపిల్, మెటా (ఫేస్‌బుక్ మాతృసంస్థ), మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, టెస్లా వంటివి సైతం.. 2022తో పోలిస్తే ఫ్రెషర్స్ నియామకాలను 2024లో సగానికిపైగా తగ్గించినట్టు తెలిపింది. కృత్రిమ మేధ పరిధి, స్థాయి నానాటికీ విస్తరించడం, జూనియర్ స్థాయి ఉద్యోగులు చేయగల పనులన్నింటినీ ఏఐ చాలా సులువుగా చేసేయగలుగుతుండడం.. అదే సమయంలో కంపెనీ బడ్జెట్ నిర్వహణ కష్టమవుతుండడంతో కంపెనీలు కొత్త పట్టభద్రుల నియామకాలను తగ్గించుకోవడంపై దృష్టిసారించాయని సిగ్నల్‌ఫైర్ విశ్లేషించింది.
ప్రవేశస్థాయి ఉద్యోగాలే కాదు. మధ్యస్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చేయగలిగే పనిని సైతం ఏఐ చేయగలుగుతోందని మెటా సీఈవో మార్క్ జుకెర్‌బెర్గ్ ఇటీవలే వెల్లడించారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేస్తున్న ‘లామా’ ఏఐ వంటి మేజర్ ప్రాజెక్టుల కోడింగ్‌ను సైతం కృత్రిమ మేధ ఏడాది-రెండేళ్లలో సొంతంగా రాసేయగలదని ఆయ న అంచనా వేశారు. ఇక.. తమ కోడింగ్‌లో 30ు పనిని ప్రస్తుతం కృత్రిమ మేధే చేస్తోందని గూగుల్ సీఈవో సుందర్‌పిచాయ్ ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం.. తమ కోడింగ్ పనిలో 30ు కృత్రిమమేధే చేస్తోందని, తమ కంపెనీకి సంబంధించిన కొన్ని అంతర్గత ప్రాజెక్టులను సైతం ఏఐ ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా పూర్తిస్థాయిలో చేపడుతోందని చెప్పారు. ఐబీఎం కంపెనీ ఏఐని వాడడం మొదలుపెట్టాక 8 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
ఇలా పెద్ద, చిన్న తేడా లేకుండా అన్ని కంపెనీలూ ఏఐపై ఆధారపడడం నానాటికీ పెరుగుతుండడంతో ఆ ప్రభావం ఉద్యోగాలపై భారీగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఫ్రెషర్స్‌పై పడుతోంది. అలాగని టెక్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయా అంటే.. తగ్గట్లేదు సరికదా పెరుగుతున్నాయని, నేరుగా టెక్ కంపెనీల్లో కాకుండా ఆరోగ్యసంరక్షణ, బ్యాంకింగ్, రిటైల్ రంగాల్లో టెకీలకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని సిగ్నల్‌ఫైర్ తన నివేదికలో వివరించింది. కాకపోతే ఆ ఉద్యోగాలు సాధించాలంటే కృత్రిమమేధకు సంబంధించిన నైపుణ్యాలు అవసరమని స్పష్టం చేసింది. అమెరికాలో ఈ ట్రెండ్ ఇప్పటికే జోరందుకుంది. ‘ఏఐ’ నైపుణ్యాలున్నవారినే ఉద్యోగాల్లోకి తీసుకోవడం పెరుగుతోందని.. ప్రతి నాలుగు ఉద్యోగ ప్రకటనల్లో ఒకటి కృత్రిమ మేధ నైపుణ్యాలను తప్పనిసరిగా పేర్కొంటోందని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ చేసిన సర్వేలో వెల్లడైంది. కాబట్టి.. కొత్తగా డిగ్రీ/పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నవారు ఏఐ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని టెక్ పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - May 30 , 2025 | 02:56 PM