ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmedabad: కాబోయే డాక్టర్లు.. కల చెదిరి..

ABN, Publish Date - Jun 13 , 2025 | 05:59 AM

వారంతా కాబోయే వైద్యులు.. ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణం పోసి కాపాడేవారు.. సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఆ భవనంపై విమానం కుప్పకూలడంతో వారు కన్న కలలు చెదిరిపోయాయి.

  • హాస్టల్‌ మెస్‌పై విమానం కూలడంతో

  • పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి!

  • భోజనం చేస్తూనే కన్నుమూసిన కొందరు మరికొందరికి తీవ్ర గాయాలు

  • భవనంలో ఎటు చూసినా విధ్వంసమే

  • 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు

  • పేర్కొన్న దైనిక్‌ భాస్కర్‌ వార్తా సంస్థ

అహ్మదాబాద్‌, జూన్‌ 12: వారంతా కాబోయే వైద్యులు.. ప్రమాదంలో ఉన్నవారికి ప్రాణం పోసి కాపాడేవారు.. సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.. ఉన్నట్టుండి ఆ భవనంపై విమానం కుప్పకూలడంతో వారు కన్న కలలు చెదిరిపోయాయి. భోజనం చేస్తున్న కొందరు వైద్య విద్యార్థులు అలాగే ప్రాణాలు కోల్పోగా.. శిథిలాలు మీద పడి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారంతా కంచాల్లో ఆహారాన్ని ఎలా ఉన్నది అలా వదిలేసి భయంతో పరుగులు పెట్టారు. అహ్మదాబాద్‌లోని బీజే వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై ఎయిరిండియా విమానం కూలిపోయినప్పటి హృదయ విదారక దృశ్యమిది. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులోని మెస్‌లో 60మందికి పైగా వైద్య విద్యార్థులు, పీజీ చేస్తున్న రెసిడెంట్‌ వైద్యులు భోజనం చేస్తున్నారని అంచనా. వీరిలో చాలా మంది ఆచూకీ తెలియలేదు. శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను గుర్తించారు. కొందరు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘‘చాలా మంది వైద్య విద్యార్థులు, పీజీ వైద్యుల ఆచూకీ లభించడం లేదు. కొందరి మృతదేహాలను మాత్రం గుర్తించారు. ఇక్కడి పరిస్థితిని చూస్తుంటే 50 మంది వరకు మరణించి ఉంటారు..’’ అని బీజే వైద్య కళాశాలకు చెందిన వైద్యుడు కెవ్లిన్‌ నిర్వాన్‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 50 మంది వైద్య విద్యార్థులు మృతిచెందినట్టుగా దైనిక్‌ భాస్కర్‌ వార్తా సంస్థ తమ వెబ్‌ సైట్‌లో పేర్కొంది.

కిందకు దూకేసిన కొందరు..

ఇక ఇదే భవనంలోని మిగతా అంతస్తుల్లో రెసిడెంట్‌ వైద్యులు కుటుంబాలతో నివసిస్తున్నారు. విమానం కుప్పకూలి, మంటలు చెలరేగడంతో రెండు, మూడో అంతస్తుల్లోని కొంత భాగం కూడా ధ్వంసమైంది. దీనితో ఆయా కుటుంబాల వారు కూడా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు రెండు, మూడో అంతస్తుల నుంచి కిందికి దూకేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘నేను, నా జూనియర్‌ డాక్టర్‌ గాయపడ్డాం. మరో 30-40 మందికి తీవ్రగాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు’’ అని డాక్టర్‌ శ్యామ్‌ గోవింద్‌ తెలిపారు. ఇక తన కుమారుడు లంచ్‌ బ్రేక్‌ కోసమని క్యాంటీన్‌కు వెళ్లాడని, ప్రమాదం జరగడంతో రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడని ఓ వైద్య విద్యార్థి తల్లి రమీలా వెల్లడించారు.

ఎటు చూసినా విధ్వంసమే

విమానం కుప్పకూలడం, భారీగా మంటలు చెలరేగడంతో.. హాస్టల్‌ భవనంలో మెస్‌ సహా చాలా భాగం తీవ్రంగా ధ్వంసమైంది. దీనికి సంబంధించి వైద్య విద్యార్థులు, సహాయక చర్యల్లో పాల్గొన్న స్థానికులు తీసిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. అందులో ఎటు చూసినా కూలిపోయి, చెల్లాచెదురుగా పడిన భవన పైకప్పు, గోడల శిథిలాలు, విమానం భాగాలు, వేలాడుతున్న విద్యుత్‌ తీగలు కనిపిస్తున్నాయి. విమానం తోక భాగం కొంత ఆ భవనం నాలుగో అంతస్తులోకి చొచ్చుకెళ్లి, పైనుంచి వేలాడుతూ కనిపిస్తోంది. మెస్‌లోని కొన్ని టేబుళ్లపై కంచాలు, వాటిలో మిగిలి ఉన్న ఆహారం దుర్ఘటనతో నెలకొన్న విషాదానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కాగా, భారత వైద్య రంగంలో ఇదొక దారుణ విషాదమని, భవిష్యత్తు వైద్యులను కోల్పోవడం బాధాకరమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ధ్రువ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

గాల్లో ప్రాణాలు!

  • దేశ చరిత్రలో వినాశకరమైన విమాన ప్రమాదాల జాబితా ఇదీ...

  • 2020 ఆగస్టు 7 ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం దుబాయ్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌ చేరుకుంది. అక్కడి ల్యాండ్‌ అవుతుండగా వర్షం కారణంగా అదుపుతప్పి రన్‌వే నుంచి జారిపోయింది. టేబుల్‌టాప్‌ రన్‌వేను దాటి పక్కనే ఉన్న లోయలో పడి పోయింది. విమానంలో 190 మంది ఉండగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 2010 మే 22న దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన బోయింగ్‌ విమానం కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా టేబుల్‌టాప్‌ రన్‌వేకు అవతల ఉన్న లోయలో పడిపోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • 2000 జూలై 17న అలయన్స్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ విమానం బిహార్‌లోని పాట్నాలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో అదుపుతప్పి జనావాసాలపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 55 మందితో పాటు కింద ఉన్న మరో ఐదుగురు మరణించారు.

  • 1996 నవంబరు 12న హరియాణా సమీపంలోని చార్కి దాద్రి సమీపంలో సౌదీకి చెందిన బోయింగ్‌ 747 విమానం, కజకిస్థాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఇల్యూషిన్‌ ఇల్‌-76 విమానం ఢీకొన్న ఘటనలో 349 మంది ప్రాణాలు కోల్పోయారు. కజకిస్థాన్‌ విమానం నిర్దేశించిన ఎత్తు కంటే కిందకు దిగడంతో ప్రమాదం సంభవించింది.

  • 1991 ఆగస్టు 16న కోల్‌కతా నుంచి ఇంఫాల్‌కు వెళ్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం నావిగేషన్‌ లోపం కారణంగా కొండల్లో కూలిపోవడంతో 59 మంది ప్రయాణికులు మరణించారు.

  • 1990 ఫిబ్రవరి 14న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకుంటుండగా కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 146 మందిలో 92 మంది మృతిచెందారు.

  • 1988 అక్టోబరు 19న ముంబై నుంచి అహ్మదాబాద్‌ వస్తున్న బోయింగ్‌ 737-200 విమానం పొగమంచు కారణంగా విమానాశ్రయానికి సమీపంలో చెట్లను ఢీకొని కూలిపోయింది. విమానంలో ఉన్న 135 మందిలో 133 మంది దుర్మరణం చెందారు.

  • 1985 జూన్‌ 23న మాంట్రియల్‌- లండన్‌ ఎయిరిండియా కనిష్క విమానం ఐర్లాండ్‌ సమీపంలో నేలకు 31 వేల అడుగుల ఎత్తున పేలిపోయింది. 1984లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ప్రతీకారంగా సిక్కు ఉగ్రవాదులు ఈ విమానంలో సూటుకేసు బాంబు అమర్చారు. మొత్తం 329 మంది మరణించారు.

  • 1982 జూన్‌ 21న కౌలాలంపూర్‌ నుంచి ముంబైకి వస్తున్న బోయింగ్‌ విమానం భారీ వర్షం కారణంగా ముంబైలోని శాంతాక్రాజ్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతుండగా కూలిపోయింది. ఈ ఘటనలో 58 మంది మృతిచెందారు.

  • 1978 జనవరి 1న ముంబైనుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్‌ 747 విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. 213 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

  • 1976 అక్టోబరు 12న ముంబై నుంచి మద్రాస్‌ వెళ్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజన్‌ వైఫల్యంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి కూలిపోవడంతో 54 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Jun 13 , 2025 | 05:59 AM