Travel Ban: 36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా
ABN, Publish Date - Jun 16 , 2025 | 10:06 AM
ప్రస్తుతం 12 దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌ను 36 దేశాలకు విస్తరించే యోచనలో అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది. భూటాన్, ఈజిప్ట్ దేశాలపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పన్నెండు దేశాల పర్యాటకులను అమెరికాకు రాకుండా నిషేధం విధించిన ట్రంప్ ప్రభుత్వం.. దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ శాఖ అంతర్గత నివేదికను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశ భద్రత దృష్ట్యా పర్యాటకులపై నిషేధాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు.
విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికలో అమెరికా ప్రభుత్వ ఆందోళన గురించి చర్చించారు. కొన్ని దేశాల్లో పౌరుల గుర్తింపునకు సంబంధించిన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 36 దేశాలపై పాక్షిక, లేదా పూర్తిస్థాయి ట్రావెల్ బ్యాన్ విధించాలని విదేశాంగ శాఖ సూచించింది.
పాస్‌పోర్టు భద్రతలో లోపాలు, వీసా గడువుకు మించి అమెరికాలో ఉంటున్న జనాలు, డిపోర్టేషన్‌కు కొన్ని దేశాలు సహకరించకపోవడం, ఉగ్రవాద కార్యకలాపాలు, యూదువ్యతిరేక కార్యక్రమాల్లో విదేశీయులు పాలుపంచుకోవడం తదితర సమస్యలను విదేశాంగ శాఖ పేర్కొంది. ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన సూచనలను 60 రోజుల్లో అమలు పరచని పక్షంలో ఆయా దేశాలపై నిషేధం అమలు చేయాలని నిర్ణయించింది.
అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, భూటాన్, బుర్కినా ఫాసో, కాబో వర్డే, కంబోడియా, కామెరూన్, కోట్ డి'వోయర్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, జిబూటీ, డొమినికా, ఈథియోపియా, ఈజిప్ట్, గ్యాబోన్, ద గాంబియా, ఘానా, కిర్గిజిస్తాన్, లైబీరియా, మాలావి, మౌరిటానియా, నైజర్, నైజీరియా, సెంట్ కిట్స్ అండ్ నేవిస్, సెంట్ లూసియా, సావ్ టోమే అండ్ ప్రిన్సిపే, సెనెగల్, దక్షిణ సూడాన్, సిరియా, టాంజానియా, టోంగా, టువాలు, ఉగాండా, వనాటు, జాంబియా, జింబాబ్వే దేశాలకు ట్రావెల్ బ్యాన్ వర్తింప చేసే అవకాశం ఉంది.
రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌లుగా మారి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వెనిజులా జాతీయులను ప్రభుత్వం ఇటీవల పెద్ద సంఖ్యలో సొంత దేశానికి డిపోర్టు చేసింది. విదేశీ విద్యార్థులకు సంబంధించిన నిబంధనలను కూడా కఠినతరం చేసింది.
ఇవీ చదవండి:
పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ
భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 16 , 2025 | 10:20 AM