Share News

Dassault Aviation: పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ

ABN , Publish Date - Jun 15 , 2025 | 09:09 PM

రఫేల్ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేసిన ప్రకటనలను దసో ఏవియేషన్ ఖండించింది. ఆ ప్రకటనల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

Dassault Aviation: పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ
Dassault CEO Pakistan claim

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు పాక్ చేస్తున్న ప్రకటనలను ఆ విమానాల తయారీదారు దసో ఏవియేషన్ ఖండించింది. పాక్ ప్రకటనల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈఓ ఎరిక్ ట్రేపియర్ ఓ ఫ్రెంచ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తే అందరూ ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉందని అన్నారు.

‘గగనతల యుద్ధం, నిఘా, భూతల టార్గెట్‌లపై దాడులు, న్యూక్లియర్ డిటరెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ కెరీర్‌ నుంచి కార్యకలాపాలు వంటివన్నీ చేయగలిగిన విమానాల్లో రఫేల్‌ టాప్’ అని అన్నారు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా ఉండే సామర్థ్యంలో అమెరికా ఎఫ్-22 విమానాలు కాస్త బెటరైనప్పటికీ వాస్తవంలో ఎఫ్-35 విమానాలకంటే రఫేల్ మెరుగని అన్నారు. చైనా విమానాల కంటే కూడా తమ విమానాలకు అధిక సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.


ఆపరేషన్ సిందూర్ సందర్భంగా యుద్ధ విమానాలేవీ తాము కోల్పోలేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం తాము ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పుకున్నారు. ఇందులో మూడు రఫేల్ విమానాలు కూడా ఉన్నాయని అన్నారు. భారత సైనికులను కూడా బంధించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఈ వాదనలకు మద్దతుగా ఎటువంటి ఆధారాలు సమర్పించలేక చతికిలపడ్డారు.


ఇక పాక్ ప్రకటనలను రక్షణ రంగ నిపుణులు కూడా ఖండించారు. అవాస్తవాలతో జనాలను తప్పుదారి పట్టించే వ్యూహాన్ని పాక్ ఎప్పుడూ అమలు చేస్తుందని అంటున్నారు. పహల్గాం దాడి తరువాత భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్ ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో పాక్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా భారత్.. దాయాది దాడులకు గట్టిగా బదులిచ్చింది. చివరకు పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనను భారత్ ముందుంచింది.

ఇవీ చదవండి:

శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్

భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 15 , 2025 | 09:20 PM