CRISPR: జన్యువును మార్చి.. మృత్యువును ఏమార్చి
ABN, Publish Date - May 18 , 2025 | 05:32 AM
అత్యంత అరుదైన సీపీఎస్-1 జన్యు లోపంతో పుట్టిన చిన్నారి కేజేకు అమెరికా వైద్యులు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ ద్వారా విజయవంతంగా చికిత్స చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా రూపొందించిన జీన్ ఎడిటింగ్ చికిత్సగా ఇది చరిత్రలో నిలిచింది.
అమెరికాలో 7 నెలల చిన్నారికి.. అరుదైన ‘జన్యు సవరణ’ చికిత్స
వాషింగ్టన్, మే 17: అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన చిన్నారి కేజే మల్దూన్. పుట్టుకతోనే ఏదో అనారోగ్యం. పరీక్షలు చేసిన వైద్యులు ‘సీపీఎస్ 1’గా పిలిచే అరుదైన జన్యులోపంగా గుర్తించారు. సగటున ప్రతి 13 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ఇలా పుట్టిన చిన్నారుల్లో చాలా మంది కొన్ని నెలల్లోనే చనిపోతారు. ఒకవేళ బతికినా మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉండక.. జీవచ్ఛవంలా బతకాల్సిందే. లక్షల మందిలో ఒకరికి వచ్చే సమస్య కాబట్టి.. దీనిపై పెద్ద స్థాయిలో పరిశోధనలు, ఔషధాల తయారీ వంటివేవీ లేవు. కానీ.. అమెరికా వైద్య నిపుణులు అత్యంత అరుదైన జన్యు సమస్యకు.. అంతే వినూత్నమైన ‘జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్)’ చికిత్స చేసి కేజే ప్రాణాలు నిలబెట్టారు. జన్యుమార్పిడి చికిత్సల్లో ఉపయోగించే క్రిస్పర్ విధానం సాయంతో.. ఆ చిన్నారిలోని జన్యువులోని రసాయనాల అమరికలో ఉన్న లోపాన్ని సవరించారు. ఇలా ‘ఓ వ్యక్తిలోని జన్యులోపాన్ని వారికే ప్రత్యేకించిన (పర్సనలైజ్డ్/ కస్టమైజ్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ) చికిత్స’తో నయం చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
సరికొత్త విధానంలో రూపొందించి..
కేజే పుట్టిన రెండు వారాలకే అతడి కాలేయ కణాల్లోని ఓ జన్యువులో లోపాన్ని వైద్యులు గుర్తించారు. జీవక్రియల్లో భాగంగా మన శరీరంలో ఉత్పత్తయ్యే అమ్మోనియా, ఇతర విష పదార్థాలను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌ను కాలేయం ఉత్పత్తి చేయడానికి ఆ జన్యువే కీలకం. దానిలో లోపం వల్ల ఆ ఎంజైమ్ సరిగా ఉత్పత్తిగాక.. శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి.. మెదడు దెబ్బతింటుంది. కోమాలోకి వెళ్లిపోయి, చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రి నిపుణురాలు రెబెక్కా ఆర్లెన్స్ నిక్లాస్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ వైద్య నిపుణుడు, భారత సంతతికి చెందిన కిరణ్ ముసునూరు బృందం ఫోకస్ చేసింది. వినూత్నమైన ప్రయోగాత్మక చికిత్స చేసేందుకు కేజే తల్లిదండ్రులు నికోల్, కైల్‌లను ఒప్పించింది. కణాల్లోని జన్యువులను కత్తిరించి.. ఏదైనా భాగాన్ని తొలగించడానికి, అవసరమైతే అతికించడానికి వీలయ్యే ‘క్రిస్పర్ కాస్9’ విధానాన్ని వినియోగించింది. కేజే కాలేయ కణాలను సేకరించి పరిశోధన చేసింది. అతడి కాలేయ కణాల్లోకి చొచ్చుకెళ్లి.. లోపం ఉన్న జన్యుభాగాన్ని మార్చేలా ఆదేశాలు ఇచ్చే పదార్థాన్ని రూపొందించింది. ఇందుకోసం సుమారు ఆరు నెలల సమయం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేజే (అప్పటికి ఏడు నెలల వయసు)కు దానితో చికిత్స చేసింది. రెండు నెలల పాటు పూర్తిగా పర్యవేక్షణ చేసి, చికిత్స విజయవంతమైందని తేల్చింది. ఇప్పుడు కేజే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 10:16 AM