US Truck Drivers-English Test: ఇంగ్లిష్ టెస్టులో విఫలం.. యూఎస్‌లో భారతీయ ట్రక్ డ్రైవర్లకు షాక్
ABN, Publish Date - Nov 03 , 2025 | 07:51 AM
ఇంగ్లిష్ భాషా నైపుణ్యం లేని 7,248 మంది కమర్షియల్ ట్రక్ డ్రైవర్లను సర్వీసు నుంచి తప్పించినట్టు అమెరికా రవాణా శాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షలో విఫలమైన విదేశీ ట్రక్ డ్రైవర్లకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. టెస్టులో విఫలమైన వారు కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అమెరికా రవాణా శాఖ మంత్రి షాన్ డఫ్ఫీ (Sean Duffy) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం పేర్కొన్న ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన 7248 ట్రక్కు డ్రైవర్లను సర్వీసు నుంచి తప్పించినట్టు తెలిపారు. అమెరికాలోని కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లిష్‌ను అర్థం చేసుకుని, మాట్లాడే సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. ఈ భాష నైపుణ్యం లేని వారిని సర్వీసు నుంచి తప్పిస్తామని తేల్చి చెప్పారు (US Commericial Truck drivers failing in English Test).
ట్రంప్ ప్రభుత్వం తాజా చర్యలతో భారతీయులపై అధికంగా ప్రభావం పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో భారతీయ కమర్షియల్ ట్రక్ డ్రైవర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రకర్స్ అసోసియేషన్ ప్రకారం, 1.30 లక్షల నుంచి 1.50 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. వీరిలో అధిక శాతం మంది పంజాబ్, హర్యానాకు చెందిన వారే. ట్రంప్ సర్కారు తాజా నిర్ణయంతో అనేక మందిపై ప్రతికూల ప్రభావం పడింది.
ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను ట్రక్ డ్రైవర్లకు తప్పనిసరి చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ నెలలో ఈ ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రకారం, కమర్షియల్ ట్రక్ డ్రైవర్లు ఇంగ్లిష్‌లో రాసున్న ట్రాఫిక్ బోర్డులు చదవగలగాలి. ట్రాఫిక్ భద్రతా అధికారులు, సరిహద్దు గస్తీ దళాలు, వ్యవసాయ ఉత్పత్తుల చెక్ పాయింట్స్, కార్గో వెయిట్ లిమిట్ స్టేషన్‌లలోని అధికారులు ఇంగ్లిష్‌లో చెప్పింది అర్థం చేసుకోగలగాలి. వారితో ఇంగ్లిష్‌లో సంభాషించగలిగే స్థాయిలో భాష నైపుణ్యాలు ఉండాలి. ఇవి ప్రొఫెషనల్ డ్రైవర్లు పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలని ట్రంప్ అప్పట్లో స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 03 , 2025 | 08:15 AM