Golden Dome: అంతరిక్షంలో ఆయుధాలు
ABN, Publish Date - May 22 , 2025 | 05:06 AM
అమెరికా డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ అనే అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను మూడు సంవత్సరాల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగానే శత్రు క్షిపణులను భూమి పక్కగా అంతరిక్షంలోనూ అడ్డుకునేందుకు ఉద్దేశించబడింది.
శత్రు క్షిపణుల నుంచి రక్షణకు రూ.15 లక్షల కోట్లతో
అమెరికా గోల్డెన్ డోమ్.. మూడేళ్లలో అందుబాటులోకి
ప్రాజెక్టులో భాగంగా రోదసిలో లేజర్ ఆయుధాలు,
ఏఐతో పనిచేసే స్పేస్‌బేస్డ్ సెన్సర్లు, ఇంటర్‌సెప్టర్లు!
వాషింగ్టన్, మే 21: హమాస్ దాడుల నుంచి తన ప్రజలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ అనే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టే.. శత్రు దేశాల క్షిపణుల నుంచి రక్షణకు అమెరికా ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేసుకోనుంది. అందులో భాగంగా.. చరిత్రలో తొలిసారి అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించేందుకు సిద్ధమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం దీనిపై ఒక ప్రకటన చేశారు. 175 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కోట్లు) దాకా ఖర్చయ్యే ఈ ‘గోల్డెన్ డోమ్ మిసైల్ షీల్డ్ సిస్టమ్’ మూడేళ్లలో (అంటే తన పదవీకాలం పూర్తయ్యేసరికి) అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రాథమికంగా దాదాపు రూ.2 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. గోల్డెన్ డోమ్ నిర్మాణం పూర్తయితే.. భూమికి ఆవలివైపు నుంచి వచ్చే క్షిపణులను, నింగి నుంచి ప్రయోగించిన క్షిపణులను సైతం అది అడ్డుకోగలదన్నారు. అమెరికా మనుగడకు, మన విజయాలకు ఇది అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కెనడా కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి.. ఈ వ్యవస్థ ద్వారా రక్షణ పొందడానికి ఆసక్తి చూపుతోందని చెప్పారు.
గోల్డెన్ డోమ్ కొత్తదేమీ కాదని.. రోనాల్డ్‌రీగన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ తరహా వ్యవస్థను ప్రతిపాదించారని ట్రంప్ గుర్తుచేశారు. అప్పట్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఏర్పాటు చేయలేకపోయారన్నారు. ఎయిర్‌ఫోర్స్, స్పేస్ ఫోర్స్‌లో 30 ఏళ్ల అనుభవం ఉన్న అధికారి..
ప్రస్తుతం అమెరికా స్పేస్ ఆపరేషన్స్ వైస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న జనరల్ మైకేల్ గుట్లిన్‌కు గోల్డెన్ డోమ్ అభివృద్ధి బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. కాగా.. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సానిక్ క్షిపణులు, డ్రోన్లతో.. అమెరికాపై శత్రువులు జరిపే సాధారణ, అణు దాడులను గోల్డెన్ డోమ్ ద్వారా అడ్డుకోవచ్చని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్‌సెత్ తెలిపారు. గోల్డెన్ డోమ్ ప్రణాళికను రష్యా, చైనా వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థ అంతరిక్షాన్ని యుద్ధరంగంగా మార్చే ప్రమాదం ఉందని, అస్థిరతలను పెంచుతుందని ఆందోళన వెలిబుచ్చాయి. 2022లో అమెరికా జోబైడెన్ హయాంలో విడుదల చేసిన మిసైల్ డిఫెన్స్ రివ్యూ నివేదికలోనే.. చైనా, రష్యాల నుంచి పెరుగుతున్న ముప్పు గురించి ప్రస్తావించింది. ఇజ్రాయెల్ 2011 నుంచి వినియోగిస్తున్న ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ.. హమాస్ ప్రయోగించే వేలాది షార్ట్ రేంజ్ రాకెట్లను నిర్వీర్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దాని స్ఫూర్తితోనే అమెరికా ఈ ప్రాజెక్టుకు గోల్డెన్ డోమ్ అనే పేరు పెట్టింది. అయితే.. ఐరన్ డోమ్ భూమ్మీద ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. కానీ, ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో భాగంగా నేలపైనే కాక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరిస్తారు. ఈ వ్యవస్థ.. అమెరికా దిశగా దూసుకొచ్చే క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు 175 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతుందని ట్రంప్ చెప్పినప్పటికీ.. అమెరికా బడ్జెట్ కార్యాలయం మాత్రం వచ్చే 20 ఏళ్లలో దీనికి 542 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.42 లక్షల కోట్ల) దాకా వ్యయమవుతుందని అంచనా వేస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
శత్రు దేశ క్షిపణులను అడ్డుకునే.. పేట్రియాట్ మిసైల్ బ్యాటరీస్, థాడ్ (టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్), ఏజిస్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్, గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ (జీఎండీ), అవెంజర్ వంటి అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థలు అమెరికా వద్ద ఇప్పటికే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. రష్యా ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులను అమెరికా వ్యవస్థలే సమర్థంగా అడ్డుకున్నాయి. అటు ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడింది కూడా అమెరికా రక్షణ వ్యవస్థలే. మరి కొత్తగా ఈ గోల్డెన్ డోమ్ ప్రతిపాదన ఎందుకు? అది ఎలా పనిచేస్తుంది? అంటే.. ఆ వివరాలేవీ ప్రస్తుతానికి అధికారికంగా అందుబాటులో లేవు. అయితే.. ఈ వ్యవస్థలో భాగంగా రోదసిలో ‘డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్స్ (లేజర్లు) ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఆ లేజర్లు.. అమెరికా దిశగా దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకుంటాయని.. కానీ, వాటిని మోహరించడం అంత సులువు కాదని వారు పేర్కొంటున్నారు. ‘‘ఒక్కో డిఫెన్సివ్ స్పేస్ బేస్డ్ లేజర్.. హబుల్ టెలిస్కోప్ అంత ఉంటుంది’’ అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన రక్షణ రంగ నిపుణుడు మైకేల్ ఓ హాన్లోన్ తెలిపారు. అలాంటి అత్యంత శక్తిమంతమైన ఒక్కో వ్యవస్థనూ అభివృద్ధి చేయడమే కాక.. వాటిని కక్ష్యలో, ప్రమాదకర వాతావరణంలో నిర్వహించడం కూడా సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జిమ్ టైక్లెట్ ప్రకారమైతే.. గోల్డెన్ డోమ్ వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మిసైల్ లాంచింగ్ జరిగినా బూస్ట్ ఫేజ్‌లోనే గుర్తించే ఉపగ్రహాలు (స్పేస్‌బేస్డ్ సెన్సర్లు), దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకునే స్పేస్ బేస్డ్ క్షిపణులు, ఏఐ ఆధారిత కమాండ్ సిస్టమ్స్ వంటివి ఉంటాయి.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:07 AM