Ukraine Naval Ship Sunk: రష్యా డ్రోన్ దాడి.. భారీ ఉక్రెయిన్ యుద్ధ నౌక ధ్వంసం.. వీడియో వైరల్
ABN, Publish Date - Aug 29 , 2025 | 11:15 AM
ఉక్రెయిన్‌కు రష్యా ఊహించని షాకిచ్చింది. భారీ యుద్ధనౌకను సముద్ర డ్రోన్ ప్రయోగించి కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌కు రష్యా భారీ షాకిచ్చింది. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన నిఘా నౌక సిమ్‌ఫెరోపోల్‌ను డ్రోన్ దాడితో ధ్వంసం చేయడంతో నౌక నీట మునిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లాగునా తరగతికి చెందిన మధ్యస్థాయి నిఘా నౌకను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణ శాఖ తెలిపిందని ఆర్టీ వార్తా సంస్థ పేర్కొంది. రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ వ్యవస్థలతో నిఘా కోసం ఉద్దేశించిన ఈ నౌకను డానుబ్ నది డెల్టా జలాల్లో తుత్తునియలు చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధ నౌకను రష్యా దళాలు సముద్ర డ్రోన్‌ను ప్రయోగించి ధ్వంసం చేయడం ఇదే తొలిసారి.
ఇక ఈ దాడిని ఉక్రెయిన్ అధికారులు కూడా ధ్రువీకరించారు. నావలోని సిబ్బంది ఒకరు మృతి చెందినట్టు ఉక్రెయిన్ నావికాదళ ప్రతినిధి తెలిపినట్టు కీవ్ ఇండిపెండెంట్ అనే వార్తా సంస్థ పేర్కొంది. నావలోని ఇతర సిబ్బందికి గాయాలు అయినా ప్రాణాపాయం మాత్రం లేదని తెలిపింది. దాడి అనంతర పర్యవసానాలపై దృష్టిపెట్టినట్టు నావికాదళ ప్రతినిధి పేర్కొన్నారని వెల్లడించింది. వార్‌గాన్జో టెలిగ్రామ్ ఛానల్ ప్రకారం, 2014 తరువాత ఉక్రెయిన్ నావికా దళంలోకి ప్రవేశించిన అతి పెద్ద యుద్ధ నౌక ఇదే.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్‌ల పాత్ర ప్రధానంగా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు తమ యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ దాడులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా సముద్ర డ్రోన్స్ ఉత్పత్తిని పెంచింది. అంతేకాకుండా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని ఓ డ్రోన్ తయారీ యూనిట్‌ను వరుస మిసైల్ దాడులతో ఒక్క రాత్రిలోనే ధ్వంసం చేసింది. టర్కీకి చెందిన బేరఖ్తార్ డ్రోన్‌ల ఉత్పత్తికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
జపాన్ పర్యటన.. టోక్యోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
భారత్‌పై అమెరికా సుంకాలు.. ఏనుగుపై ఎలుక దాడి లాంటివే: అమెరికా ఆర్థికవేత్త
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 29 , 2025 | 11:32 AM