US President Donald Trump: విదేశీ విద్యార్థులను వెనక్కు వెళ్లనివ్వటం సిగ్గుచేటు
ABN, Publish Date - Dec 12 , 2025 | 04:01 AM
భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటు అని.....
ప్రతిభావంతులైన భారత్, చైనా విద్యార్థులను తిరిగి వెళ్లనివ్వద్దు
అమెరికాలోనే నియమించుకోవాలి
గోల్డ్ కార్డు కొన్నవాళ్లకు ఐదేళ్లలోనే అమెరికా పౌరసత్వం
ట్రంప్ వెల్లడి.. గోల్డ్ కార్డు విడుదల
అమెరికా కంపెనీల అధినేతలతో భేటీ
న్యూయార్క్/వాషింగ్టన్, డిసెంబరు 11: భారత్, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాంటి విద్యార్థులకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలిచ్చి అమెరికాకే సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ టాప్ కంపెనీల అధిపతులకు సూచించారు. పలు కంపెనీల సీఈవోలతో బుధవారం ఆయన అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ట్రంప్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్ గోల్ కార్డు’లను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రంలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు కంపెనీలు వారి కోసం గోల్డ్ కార్డులను కొనుగోలు చేయాలని సూచించారు. ‘అమెరికాలోని అత్యుత్తమ విద్యా సంస్థలైన వార్టన్, హార్వర్డ్, ఎంఐటీ తదితర వాటిల్లో చదివి, టాప్‌లో నిలుస్తున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత తిరిగి వారి దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇక్కడ ఉండటం కష్టంగా (ప్రస్తుత వీసీ నిబంధనల నేపథ్యంలో) మారింది. ఇది సిగ్గుచేటు. ఈ పరిస్థితిని మార్చేందుకే వీసా ఆధారిత గోల్డ్ కార్డును ప్రవేశపెడుతు న్నాం. అత్యుత్తమ వీసా విధానం తీసుకురావాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ నన్ను ఎన్నోసార్లు కోరారు. అమెరికాలో ఉండనిస్తారో, ఉండనివ్వరో తెలియని విద్యార్థులను వర్సిటీ క్యాంప్‌సల నుంచి ఎలా నియమించుకోవాలి? అని ఆయన నన్ను అడిగారు. ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డు ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతుంది’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు ద్వారా అమెరికా ఖజానాకు వేలకోట్ల డా లర్ల సంపద వచ్చి చేరుతుందని ఆయన చెప్పారు.
అమెరికా పౌరసత్వానికి అత్యుత్తమ మార్గం
త్వరగా అమెరికా పౌరసత్వం సంపాదించి, ఇక్కడే స్థిరపడాలనుకునే వారికి ట్రంప్ గోల్డ్‌కార్డు అత్యుత్తమ మార్గమని ట్రంప్ తెలిపారు. ‘గోల్డ్ కార్డు కూడా గ్రీన్ కార్డే. కానీ, అంతకంటే ఉత్తమమైనది, ఇది గొప్ప వ్యక్తులకు లభిస్తుంది. ఉదాహరణకు వార్టన్‌స్కూల్ ఆఫ్ ఫైనాన్స్‌లో క్లాస్ ఫస్ట్ వచ్చిన విదేశీ విద్యార్థిని ఐబీఎం సంస్థ ఉద్యోగంలోకి తీసుకోవాలని అనుకుంది. కానీ, ఆ విద్యార్థి చదువు పూర్తవ్వగానే స్వదేశం వెళ్లిపోతాడు కాబట్టి ఉద్యోగంలో నియమించుకోవటం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఆ విద్యార్థి కోసం ఐబీఎం గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే సరిపోతుంది’ అని ట్రంప్ వివ రించారు.
కార్డు తీసుకున్న ఐదేళ్లలో పౌరసత్వం: లుట్నిక్
ట్రంప్ గోల్డ్ కార్డు ప్రయోజనాలను అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ సమావేశంలో వివరించారు. ‘ట్రంప్ గోల్డ్ కార్డును వ్యక్తులు వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే 10 లక్షల డాలర్లకు లభిస్తుంది. అమెరికా కంపెనీ ఒక విదేశీ ఉద్యోగిని ఇక్కడే నియమించుకొని, అతడికి అమెరికా పౌరసత్వం వచ్చేలా చేయాలనుకుంటే 20 లక్షల డాలర్లకు లభిస్తుంది. గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వ్యక్తిని అన్ని విధాలుగా పరీక్షించి, అమెరికాకు పనికివచ్చే అత్యుత్తమ వ్యక్తి అని నిర్ధారణకు వస్తే ఐదేళ్లలో అమెరికా శాశ్వత పౌరసత్వం జారీచేస్తాం. గోల్డ్ కార్డులవల్ల విదేశీ ఉద్యోగుల్లో ఉత్తమ ప్రతిభావంతులు మాత్రమే అమెరికాకు రాగలరు. పాత వీసా విధానంతోనే అత్యుత్తమ నైపుణ్యంగల వారిని అమెరికాలోకి ఆహ్వానించాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనే ఈ గోల్డ్ కార్డు’ అని వివరించారు. అలాగే ‘ట్రంప్‌కార్డ్.జీవోవీ’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించి దరఖాస్తులు ఆహ్వానించటం మొదలుపెట్టారు.
Updated Date - Dec 12 , 2025 | 04:01 AM