Trump: చైనాపై సుంకాలు తగ్గుతాయ్
ABN, Publish Date - Apr 24 , 2025 | 06:12 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన సుంకాలు గణనీయంగా తగ్గిపోతాయని, అయితే వాటి ప్రభావం సున్నా కాకుండా ఉండేలా ఉంటుందని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఎగబాకాయి, మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సుంకాలపై తీవ్రంగా విమర్శలు చేశారు.
కానీ సున్నాకు మాత్రం చేరవు: ట్రంప్
వాషింగ్టన్, ఏప్రిల్ 23: చైనాపై అధిక సుంకాలతో విరుచుకుపడి వాణిజ్య యుద్ధానికి తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టుగా సంకేతాలిచ్చారు. చైనా ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, అయితే సున్నా మాత్రంకావని మంగళవారం వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా చైనా సుంకాలు విధించడంతో ఆ దేశ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 145 శాతం మించాయి. ఈ నేపథ్యంలో ‘‘145 శాతం అనేది చాలా ఎక్కువ . అయితే అది అంత ఎక్కువగా ఉండదు... గణనీయంగా తగ్గుతుంది. కానీ సున్నా మాత్రం కాదు’’ అని ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా, చైనా మధ్య అధిక సుంకాలు రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని అడ్డుకున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అంతకు ముందు వ్యాఖ్యానించారు. దీని గురించి ప్రశ్నించిన సందర్భంగా ట్రంప్ పై విధంగా స్పందించారు. కాగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. షీ చర్చలకు వస్తారన్న ఆశాభావాన్ని ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. ఒప్పందం కోసం చైనా లేదా షీతో అమెరికా కఠినంగా వ్యవహరించబోతోందా, కొవిడ్ మహమ్మారి గురించి అధికారులు ప్రస్తావిస్తారా అని ప్రశ్నించగా.. లేదని ఆయన సమాధానమిచ్చారు. కానీ వారు చివరకు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లో జోరు..
చైనాపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్‌ను తొలగించే ఉద్దేశం లేదని మంగళవారం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఎగబాకాయి. ఎస్ అండ్ పీ 500 బ్లూచిప్ ఇండెక్స్, నాస్‌డాక్ 2.5 శాతానికి పైగా పెరిగాయి. ఆసియా మార్కెట్లో జపాన్ సూచీ నిక్కీ దాదాపు 2 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2.4 శాతం, దక్షిణ కొరియా కాస్పీ 1.6 శాతం పెరిగాయి. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యూరప్ మార్కెట్లలోనూ ర్యాలీ నెలకొంది. యూకే ఎఫ్‌టీఎ్‌సఈ 100 ఇండెక్స్ 1.6 శాతం, ఇటాలియన్ ఎఫ్‌టీఎ్‌సఈ ఎంఐబీ 1.1 శాతం పెరిగాయి. జర్మనీ డాక్స్ 2.6 శాతం, ఫ్రాన్స్ సీఏసీ 2.5 శాతం పుంజుకుంది. పావెల్‌ను తొలగించబోమని ట్రంప్ పేర్కొనడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. ఇదిలా ఉండగా, సుంకాల ప్రయోగాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బుధవారం తీవ్రంగా విమర్శించారు. ఇవి అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను బలహీనపరచడమేకాకుండా ప్రపంచ ఆర్థిక క్రమాన్ని అస్థిరపరుస్తాయని ఆయన హెచ్చరించారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 24 , 2025 | 06:12 AM