Donald Trump: ఇప్పటివరకూ 8 యుద్ధాలను ఆపాను.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
ABN, Publish Date - Oct 13 , 2025 | 07:33 AM
యుద్ధాలకు ఫుల్ స్టా్ప్ పెట్టి శాంతిని నెలకొల్పడంలో తనది అందెవేసిన చేయి అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అప్ఘాన్-పాక్ ఘర్షణలకు కూడా ముగింపు పులుకుతానని అన్నారు. వాణిజ్య దౌత్యంతో భారత్-పాక్ యుద్ధానికి బ్రేక్ చెప్పానని మరోసారి పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధాలను ముగించడంలో తాను నేర్పరి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. శాంతి నెలకొనేలా చేసినందుకు నోబెల్ బహుమతిని తానెప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి అఫ్ఘాన్-పాక్ ఘర్షణల వైపు మళ్లిందని కూడా చెప్పారు (Trump Stopped 8 Wars).
ఈజిప్ట్‌లో జరగనున్న శాంతి సదస్సు కోసం బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడారు. సుంకాల బెదిరింపులతోనే భారత్, పాక్ యుద్ధాన్ని అడ్డుకున్నానని మరోసారి చెప్పారు. తన దౌత్య ప్రయత్నాల లక్ష్యం ప్రజల ప్రాణాలు కాపాడటమేనని అన్నారు. అవార్డుల కోసం ఇదంతా చేయట్లేదని స్పష్టం చేశారు (Afghan Pak Conflict).
గాజాలో యుద్ధం కూడా ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘నేను పరిష్కరించిన 8వ యుద్ధం ఇది. ఇక పాక్, ఆఫ్ఘానిస్థాన్ కూడా ఘర్షణలకు దిగినట్టు నాకు తెలిసింది. అయితే, అమెరికాకు వెళ్లే వరకూ కాస్త వేచి చూడాలి. యుద్ధాలను ముగించడంలో నేను నేర్పరిని’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం హమాస్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సుస్థిర పరిచి, ఇజ్రాయెల్ బందీల విడుదల కోసం ట్రంప్ ఈజిప్టుకు ప్రయాణం కట్టారు. అనుకున్నదానికంటే ముందుగానే ఇజ్రాయలీలను హమాస్ విడిచిపెడుతుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. మంగళవారానికి కల్లా వారు స్వదేశానికి తిరిగొస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ టూర్‌లో భాగంగా ట్రంప్ తొలుత జెరుసలేమ్‌ను సందర్శిస్తారు. అనంతరం, ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2008లో చివరిసారిగా అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటు ప్రసంగం అనంతరం ట్రంప్ ఈజిప్టుకు వెళతారు. ఆ దేశ అధ్యక్షుడితో కలిసి సంయుక్తంగా శాంతి సదస్సుకు సారథ్యం వహిస్తారు. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం, గాజా పునర్ నిర్మాణం, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చిస్తారు.
ఇవి కూడా చదవండి:
నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్
58 మంది పాక్ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 13 , 2025 | 09:50 AM