Share News

Afghanistan: 58 మంది పాక్‌ సైనికులను చంపాం

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:09 AM

దాడి, ప్రతిదాడులతో పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఖైబర్‌ ఫఖ్తుంక్వా, బలోచిస్తాన్‌ సరిహద్దు వెంబడి శనివారం రాత్రి నుంచి జరుగుతున్న సైనిక చర్యల్లో...

Afghanistan: 58 మంది పాక్‌ సైనికులను చంపాం

  • 20 పాక్‌ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశాం.. వైమానిక

  • దాడులకు ప్రతీకారంగానేనని ప్రకటించిన తాలిబన్లు

  • పాక్‌-అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తత

  • 200 మంది తాలిబన్‌ సైనికులను హతమార్చామన్న పాక్‌

  • సంయమనం పాటించాలని ఖతార్‌, సౌదీ, ఇరాన్‌ సూచన

న్యూఢిల్లీ, అక్టోబరు 12: దాడి, ప్రతిదాడులతో పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. ఖైబర్‌ ఫఖ్తుంక్వా, బలోచిస్తాన్‌ సరిహద్దు వెంబడి శనివారం రాత్రి నుంచి జరుగుతున్న సైనిక చర్యల్లో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను హతమార్చామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. 20 పాక్‌ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని కూడా వెల్లడించింది. ఈ నెల 9న తమ గడ్డపై పాక్‌ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తాలిబన్ల ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్‌ తెలిపారు. పాకిస్థాన్‌లో ఉన్న ఐసిస్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము 1893 బ్రిటీష్‌ కాలం నాటి డ్యూరాండ్‌ లైన్‌ను గుర్తించబోమని మరోసారి తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌ కూడా తాము 200 మంది తాలిబన్లను మట్టుబెట్టామని, ఘర్షణలో తమ సైనికులు 23 మంది మృతిచెందారని అంగీకరించింది. 19 అఫ్గానిస్థాన్‌ మిలిటరీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని పాక్‌ ఆర్మీ తెలిపింది. ఆఫ్ఘన్‌ దాడులపై పాక్‌ ఆంతరిక మంత్రి మొహసిన్‌ నఖ్వీ స్పందించారు. ఇటుకలతో చేసే దాడులకు రాళ్లతో బదులిస్తామని తాలిబన్లను హెచ్చరించారు. కాగా, పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ఘర్షణను నివారించాలని, రెండు దేశాలు సంయమనం పాటించాలని ఖతార్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌ సూచించాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరాయి. దీంతో తాము దాడులు ప్రస్తుతానికి ఆపేశామని భారత్‌లో పర్యటిస్తున్న ఆఫ్ఘన్‌ విదేశాంగ మంత్రి ముత్తాఖీ తెలిపారు.

Updated Date - Oct 13 , 2025 | 06:25 AM