ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US China Trade: చైనాతో ట్రంప్‌ రాజీ!

ABN, Publish Date - Oct 31 , 2025 | 03:40 AM

భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామంటూ చైనాపై అంతెత్తున లేచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. అందుకు భిన్నంగా రాజీకి వచ్చారు....

  • సుంకాలు 57% నుంచి 47ుకు తగ్గింపు

  • జిన్‌పింగ్‌తో చర్చల తర్వాత ట్రంప్‌ ప్రకటన

బుసాన్‌, అక్టోబరు 30: భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామంటూ చైనాపై అంతెత్తున లేచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. అందుకు భిన్నంగా రాజీకి వచ్చారు. అదే సమయంలో చైనా కూడా కొంతమేర దిగి వచ్చింది. ట్రంప్‌ చైనాపై సుంకాలను పదిశాతం తగ్గించగా.. అరుదైన లోహాల సరఫరాపై నియంత్రణలను వాయిదా వేసేందుకు, అమెరికా సోయా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు చైనా అంగీకరించింది. గురువారం దక్షిణకొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఏపీఈసీ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వచ్చిన ట్రంప్‌, జిన్‌పింగ్‌.. గురువారం ఉదయం బుసాన్‌ విమానాశ్రయంలో సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అనువాదకుల సాయంతో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్‌ అమెరికాకు తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘భేటీ అద్భుతంగా జరిగింది. దీనికి పదికి 12 మార్కులు ఇవ్వొచ్చు. చైనాపై సుంకాలను ప్రస్తుతమున్న 57శాతం నుంచి 47శాతానికి తగ్గిస్తున్నాం. అరుదైన లోహాల సరఫరాపై విధించిన నియంత్రణలను ఏడాది పాటు వాయిదా వేసేందుకు చైనా అంగీకరించింది. అమెరికా నుంచి సోయాబీన్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది’’ అని ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా నుంచి ఇంధనం కొనుగోలుకు జిన్‌పింగ్‌ ముందుకొచ్చారని.. ఫెంటానిల్‌ మత్తుమందు, దాని మూల పదార్థాల సరఫరాను అరికట్టడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపే అంశంపైనా చర్చించామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటిస్తానని, ఆ తర్వాత జిన్‌పింగ్‌ కూడా అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్‌ చెప్పారు.

ఇక చైనా వాణిజ్య శాఖ కూడా అరుదైన లోహాల సరఫరా, సోయా ఉత్పత్తుల దిగుమతులపై ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రకటించింది. అయితే కీలకమైన ఎన్‌వీడియా చిప్‌సెట్లను చైనాకు అనుమతించడం, తైవాన్‌ వివాదం, అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత, రష్యా చమురు కొనుగోళ్లు వంటి అంశాలపై ట్రంప్‌-జిన్‌పింగ్‌ మధ్య చర్చలు జరగలేదు. దీనితో తాజా ఒప్పందంతో పెద్దగా ప్రయోజనం లేదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారత్‌లోని నాలుగు కంపెనీలు అరుదైన (రేర్‌ ఎర్త్‌) అయస్కాంతాలను దిగుమతి చేసుకునేందుకు చైనా నుంచి లైసెన్సులు పొందాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ గురువారం వెల్లడించారు. దీనికి సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.

కెనడాపై టారి్‌ఫలు ఎత్తివేసేందుకు సెనేట్‌ తీర్మానం

కెనడాపై ట్రంప్‌ వేసిన అడ్డగోలు టారి్‌ఫలను ఎత్తివేయాలంటూ అమెరికా చట్టసభ సెనేట్‌ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 50, వ్యతిరేకంగా 46 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనేటర్‌ టిమ్‌కైన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, డెమోక్రాట్లతోపాటు అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు కూడా దానికి మద్దతుగా ఓటు వేయడం గమనార్హం. గతంలోనూ ఇదే తరహాలో ట్రంప్‌కు అడ్డగోలుగా టారి్‌ఫలు వేసే అధికారం లేదంటూ సెనేట్‌ తీర్మానం చేసింది. కానీ రిపబ్లికన్లకు ఎక్కువ పట్టున్న ప్రతినిధుల సభ ఆ తీర్మానాన్ని చేపట్టేందుకు తిరస్కరించింది. తీర్మానం అమల్లోకి రావాలంటే.. ఇరు సభలు ఆమోదించాల్సిందే.

Updated Date - Oct 31 , 2025 | 03:40 AM