Trump-SSBN Deployment: రష్యా సమీపంలో అమెరికా అణు సబ్‌మెరైన్‌ల మోహరింపు
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:56 AM
రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా కట్టడికి అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణం రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా సమీపంలో రెండు అణు జలాంతర్గాములు మోహరించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అణ్వాయుధ ప్రయోగంపై రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ సన్నిహితుడు డిమిట్రీ మెద్వెదేవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిగా ఈ చర్య తీసుకున్నట్టు ట్రంప్ తెలిపారు.
‘రష్యా కట్టడి కోసం జలాంతర్గాములను తగిన ప్రదేశాల్లో మోహరించాలని ఆదేశించాను. వారి మూర్ఖపు హెచ్చరికలు మరో మలుపు తిరగొచ్చన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నా. మాటలు చాలా ముఖ్యమైనవి. అనుకోని పరిస్థితులకు దారి తీయొచ్చు. కానీ ఈసారి అలా జరగదనే ఆశిస్తున్నా’ అంటూ మెద్వెదేవ్ హెచ్చరికలను కూడా ప్రస్తావించారు.
ఏమిటీ డెడ్ హ్యాండ్
అణ్వాయుధం ప్రయోగం కోసం మనుషుల ప్రమేయం అవసరం లేని విధంగా రష్యా నిర్మించుకున్న ఆటోమేటిక్ వ్యవస్థను డెడ్ హ్యాండ్‌గా పిలుస్తారు. అణ్వాయుధ ప్రయోగానికి రష్యా అధినాయకత్వం అనుమతి తప్పనసరి. కానీ శత్రు దేశ దాడిలో అధినాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోతే చిట్ట చివరి దాడి చేసేందుకు ‘డెడ్ హ్యాండ్’ అణ్వాయుధ ప్రయోగ వ్యవస్థను రష్యా తయారు చేసుకుంది. అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ వ్యవస్థకు రూపకల్పన చేసింది.
రష్యా, భారత్‌లు తమ మృత ఆర్థిక వ్యవస్థలతో (డెడ్ ఎకానమీస్) కలిసి నట్టేట మునగాలంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా మెద్వెదేవ్ డెడ్ హ్యాండ్ ప్రస్తావన తెచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపుపై ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.
ఇక ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంకా 10 రోజులే ఉందని ట్రంప్ రష్యాను మంగళారం హెచ్చరించిన విషయం తెలిసిందే. యుద్ధం ఆపకపోతే రష్యా చమురును కొనే దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే, రష్యా మాత్రం ట్రంప్ హెచ్చరికలకు లొంగేదే లేదని స్పష్టం చేసింది. ఇక మెద్వెదేవ్ వ్యాఖ్యలు అతడి వాచాలత్వానికి సంకేతమని కొందరు విశ్లేషకులు చెబుతారు. కొందరు మాత్రం రష్యా అధినాయకత్వం మనోభావాలకు ఈ కామెంట్స్ అద్దం పడుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు.. ట్రంప్ రెస్పాన్స్ ఇదీ
టెస్లా ఆటో పైలట్ వైఫల్యం.. 242 మిలియన్ డాలర్‌ల పరిహారం చెల్లించాలంటూ తీర్పు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 02 , 2025 | 11:56 AM