US President Donald Trump: పాక్ అణు పరీక్షలు చేస్తోంది
ABN, Publish Date - Nov 04 , 2025 | 04:49 AM
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
రష్యా, ఉత్తర కొరియా, చైనా కూడా చేస్తున్నాయి
ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నాయి
మేం అలాకాదు.. బహిరంగంగా చెబుతాం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్య
వాషింగ్టన్, బీజింగ్, నవంబరు 3: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తామే కాదు.. చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని.. ఆ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని సంచలన ప్రకటన చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ సహా ప్రపంచంలో అనేక దేశాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని సీబీఎన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. ‘కానీ.. ఆయా దేశాలు వాటి గురించి మాట్లాడడం లేదు. మేం మాత్రం అలాకాదు. ఏదైనా బహిరంగంగానే చెబుతాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే తమ వద్ద ఎక్కువే ఉన్నాయని ట్రంప్ తెలిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయవచ్చన్నారు. అయితే.. అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలంటూ ట్రంప్ తాజాగా జారీచేసిన ఆదేశాలపై అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి క్రిస్ రైట్ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే అణుపరీక్షల్లో ఎలాంటి విస్ఫోటాలు ఉండవని స్పష్టం చేశారు. అణ్వాయుధాలకు సంబంధించి ఇతర వ్యవస్థలన్నీ నిర్దేశిత లక్ష్యం మేరకు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, చైనా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. తమ దేశం ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. అణ్వాయుధాల విషయంలో ‘ముందుగా వినియోగించకూడదు’ అనే విధానానికి కట్టుబడి ఉన్నామని, చైనా అణు వ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైనదని పేర్కొంది.
Updated Date - Nov 04 , 2025 | 04:49 AM