US visa restrictions: అమెరికాలో గడప దాటనిభారతీయులు!
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:28 AM
వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు.. భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బెంబేలెత్తిస్తున్న ‘వీసా’ తనిఖీలు ఇళ్లకే పరిమితమైన వలసదారులు
ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి
విదేశాలే కాదు.. అమెరికా లోపలి ప్రయాణాలూ రద్దు చేసుకున్న వైనం
అగ్రరాజ్యంలో సందడి లేని ‘న్యూ ఇయర్’
కేఎ్‌ఫఎఫ్, ఎన్‌వైటీ సర్వేల్లో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 30: వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు.. భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడపదాటి బయటకురాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే.. తిరిగి అనుమతిస్తారో లేదోనన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉంటున్నారని కైసెర్ ఫ్యామిలీ ఫౌండేషన్(కేఎ్‌ఫఎఫ్), న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు.. విదేశీ పర్యటనలతోపాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటూ.. ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సర్వే పేర్కొంది. కేవలం వలసదారులే కాకుండా.. అవసరమైన పత్రాలు ఉన్న పౌరులు కూడా అమెరికా వెలుపల ప్రయాణాలను నిలుపుదల చేసుకుంటున్నారు. ఈ సర్వే ప్రకారం.. వలసదారుల్లో 27 శాతం లేదా పది మందిలో ముగ్గురు చొప్పున అమెరికాలో లేదా ఇతర దేశాల్లో పర్యటనలను నిలిపివేసుకున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా ఉన్నవారితోపాటు సరైన పత్రాలు ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలా 32 శాతం మంది హెచ్-1బీ వీసాదారులు, 15 శాతం మంది పత్రాలు సరైనవి ఉన్నవారు ఉన్నారని సర్వే పేర్కొంది. ఇక సరైన పత్రాలు లేనివారి సంఖ్య భారీగానే ఉంటుందని తెలిపింది. మొత్తంగా 63 శాతం మంది వలసదారులు అమెరికా లోపల, వెలుపల ప్రయాణాలకు కూడా దూరంగా ఉన్నారని సర్వే అంచనా వేసింది. వాస్తవానికి అమెరికాలో ప్రస్తుతం వార్షిక సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో కొత్త సంవత్సర వేడుకల కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకుంటారు. లక్షలాది మంది రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సందడి కనిపించడం లేదని సర్వే పేర్కొంది. ఇది కొత్త సంవత్సర వేడుకలపై ప్రభావం చూపించనుందని తెలిపింది.
అడుగడుగున నిఘా!
వలసదారులు సహా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రయాణించే అన్ని మార్గాల్లోనూ అధికారులు నిఘా పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రవాణా భద్రతాధికారులు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో సదరు పత్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే.. ఆ వివరాలను తక్షణమే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో పంచుకుంటున్నారు. దీంతో వలసదారులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా లోపల కూడా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. అమెరికా లోపల ప్రయాణించే విమానాలు ఎక్కే వారి వివరాలను కూడా అధికారులు నిశితంగా గమనించడం ఇదే తొలిసారి అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ప్రయాణికుల వివరాల్లో ఏ చిన్న లోపాన్ని గుర్తించినా.. ఫెడరల్ ఏజెన్సీలు.. వారిని నిర్బంధించడం, అరెస్టు చేయడం, దేశం నుంచి పంపించేయడం వంటివి చేస్తున్నారని, దీంతో వలసదారులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారని సర్వే వివరించింది. ఇక, అమెరికా నుంచి విదేశాలకు వచ్చిన వారు తిరిగి వెళ్లేలోగా ఎలాంటి నిబంధనలు మారతాయోనన్న బెంగతో ఉన్నారు. దీంతో మళ్లీ హెచ్-1బీ వీసా పొందాలంటే ఇంటర్వ్యూలు సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా స్వదేశాలకు రావాలన్న ఆకాంక్షను వారు నిలువరించుకుని అమెరికాకే పరిమితం అవుతున్నారు. మరోవైపు, ఈ సమస్యను గమనించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు.. తమ ఉద్యోగులు విదేశాలకు వెళ్లరాదని సూచించాయి.
జర్మనీ నుంచి వందల మంది భారతీయ విద్యార్థుల బహిష్కరణ!
జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న యూర్‌పలోని అతిపెద్ద ప్రైవేటు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం(ఐయూ)లో చదువుతున్న భారతీయ విద్యార్థులు బహిష్కరణ వేటును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వారు చదువుతున్న కోర్సుకు, వారు పొందిన విద్యార్థి వీసాకు సంబంధం లేకపోవడంతో విద్యార్థులను దేశం నుంచి తిరిగి పంపించేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసిందే. దీంతో వందలాది మంది విద్యార్థులపై బహిష్కరణ వేటుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే..ఈ పరిణామంతో విద్యార్థులు తల్లడిల్లుతున్నారు. ట్యూషన్ ఫీజు సహా జర్మనీలో నివసించేందుకు అవసరమైన ఖర్చుల కోసం వారు భారీగా అప్పులు చేశారు. ఈ సమయంలో వారిని దేశం నుంచి పంపేస్తే భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐయూలో ప్రస్తుతం 1.3 లక్షల మంది వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మరో 190 దేశాలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్ కోర్సులు చేస్తున్నారు.
Updated Date - Dec 31 , 2025 | 04:28 AM