Return to Earth: స్వాగతం సునీతా!
ABN, Publish Date - Mar 19 , 2025 | 03:18 AM
ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్) వెళ్లి.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్....
ఎట్టకేలకు ఐఎస్ఎస్ నుంచి భూమ్మీదికి సునీతా విలియమ్స్!
మంగళవారం ఉదయం 10.35కు స్పేస్ ఎక్స్ డ్రాగన్‌లో తిరుగుప్రయాణం
నేడు తెల్లవారుజామున 3.27కు ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న వ్యోమనౌక
దిగగానే వ్యోమగాములను స్ట్రెచర్‌పై తరలించి.. వైద్యపరీక్షల నిర్వహణ
ఆరు వారాల రిహ్యాబిలిటేషన్ ప్రోగ్రామ్
వాషింగ్టన్, మార్చి 18: ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్) వెళ్లి.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ ఎట్టకేలకు మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) భూమ్మీదకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి కోసం ప్రత్యేకంగా పంపిన స్పేస్ ఎక్స్ క్రూ-9 డ్రాగన్ క్యాప్సూల్ మంగళవారం ఉదయం 10.35 గంటలకు ఐఎ్‌సఎస్ నుంచి విడిపోయి భూమి దిశగా పయనమైనట్టు నాసా వెల్లడించింది. అందులో సునీత, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు అలెగ్జాండర్ గోర్బనోవ్ (రష్యా), నిక్ హేగ్ (అమెరికా) కూడా ఉన్నారు. ఈ నౌక 17 గంటలపాటు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు దిగుతుందని నాసా వెల్లడించింది. దిగగానే నాసా రికవరీ బృందాలు అక్కడికి వెళ్లి వారిని వ్యోమనౌక నుంచి బయటకు తెచ్చి.. హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయనున్నట్టు తెలిపింది. దాదాపు 9 నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో, భార రహిత స్థితిలో ఉన్న నేపథ్యంలో సునీత, విల్‌మోర్ భూమ్మీదికి తిరిగి రాగానే మామూలుగా నడవలేరని నాసా మాజీ వ్యోమగామి లెరోయ్ చియావో వెల్లడించారు. రోదసిలో ఉన్నప్పుడు శరీరంలోని రక్తం, ఇతర స్రావాలన్నీ పైభాగంలో ఎక్కువగా చేరుతాయని.. దీనివల్ల భూమ్మీదికి వచ్చాక వారు నిలబడితే రక్తపోటు పడిపోయి, కళ్లు తిరిగి పడిపోతారని వివరించారు. ఈ నేపథ్యంలో.. వైద్యపరీక్షలు పూర్తయిన అనంతరం సునీతకు, విల్‌మోర్‌కు ఆరువారాల పాటు రీహ్యాబిలిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారని, నడక, కండరాల బలోపేతానికి సంబంధించి శిక్షణ ఇస్తారని, పౌష్టికాహారం ఇస్తారని వైద్యనిపుణులు తెలిపారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే అక్కడి భారరహిత వాతావరణం వల్ల వ్యోమగాముల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వారి కండరాలు క్షీణిస్తాయి. రక్తనాళాలు సంకోచానికి గురవుతాయి. గుండె, మెదడు, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితమవుతాయి. మెదడులో స్రావాలు పెరిగి.. వినికిడి శక్తి, చూపు మందగిస్తాయి. వ్యోమగాముల మెదడుపై ఒత్తిడి పెరిగి.. ‘స్పేస్‌ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఆక్యులార్ సిండ్రోమ్ (శాన్స్)’ బారిన పడే ప్రమాదం ఉంటుంది. సగటున నెలకు 1-2ు చొప్పున వారి ఎముకల సాంద్రత తగ్గి చాలా బలహీనపడిపోతారు. రక్తప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేయక.. వారి రక్తపోటు పెరుగుతుంది. స్పేస్ రేడియేషన్‌కు ఎక్కువగా గురవడం వల్ల దీర్ఘకాలంలో వారి ఆరోగ్యంపై తీవ్ర పభ్రావం పడుతుంది. వారు క్యాన్సర్ బారిన, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల బారిన పడే ముప్పు పెరుగుతుంది.
కొత్తగా మరో నలుగురు..
డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమ్మీదికి తిరిగొచ్చిన నలుగురు వ్యోమగాముల స్థానంలో మరో నలుగురు ఆస్ట్రొనాట్లు.. అన్నే మెక్ క్లెయిన్, నికోల్ అయెర్స్(అమెరికా), టకుయ ఒనిషి (జపాన్), కిరిల్ పెస్కో (రష్యా) ఐఎస్‌ఎస్‌లో బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా కొత్తగా వచ్చిన సిబ్బంది.. అప్పటికే ఉన్న సిబ్బందితో కలిసి ఐదురోజులు ఐఎ్‌సఎ్‌సలో ఉంటారు. దీన్ని ‘హ్యాండోవర్ పీరియడ్’ అంటారు.
62 గంటల స్పేస్ వాక్
ఈ తొమ్మిది నెలల కాలంలో సునీత తొమ్మిదిసార్లు (62 గంటలపాటు) స్పేస్‌వాక్‌లు నిర్వహించి, ఆ ఘనత సాధించిన మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు.
4500 భూప్రదక్షిణలు!
ఐఎస్‌ఎస్‌లో 286 రోజులపాటు ఉన్న సునీత, విల్‌మోర్.. ఆ సమయంలో 4,500 భూప్రదక్షిణలు చేశారు.
కుక్కలతో వాకింగ్‌కి వెళ్తా
మామూలుగా మనం ఏదైనా పని మీద వేరే ఊరెళ్తే.. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, మనకు ఇష్టమైన పనులు ఏమేం చేద్దామా అనే ఆలోచన వస్తుంది. సునీత, విల్‌మోర్‌కు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. భూమ్మీదికి వచ్చాక.. తన రెండు పెంపుడు శునకాలతో వాహ్యాళికి వెళ్లాలని ఉందని, సముద్రంలో ఈత కొడతానని సునీత విలియమ్స్ చెప్పగా.. తనకు గడ్డిపై నడవాలని, తన కుటుంబంతో కలిసి సమయాన్ని గడపాలని ఉన్నట్టు బుచ్ విల్‌మోర్ వెల్లడించారు.
Updated Date - Mar 19 , 2025 | 03:19 AM