Foreign Workers: విదేశీ కార్మికులకు వీడిన కఫాలా పీడ
ABN, Publish Date - Oct 23 , 2025 | 05:33 AM
విదేశీ కార్మికులను తీవ్ర వివక్షకు, శ్రమదోపిడీకి గురిచేస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దుచేసింది.
సౌదీలో వారి శ్రమదోపిడీకి స్వస్తి
1.3 కోట్ల మందికి తక్షణ ఊరట
రియాద్, అక్టోబరు 22: విదేశీ కార్మికులను తీవ్ర వివక్షకు, శ్రమదోపిడీకి గురిచేస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దుచేసింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ రూపొందించిన విజన్-2030లో భాగంగా ఈ వ్యవస్థను తొలగించారు. భారత్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాలకు, ఫిలిప్పైన్స్ వంటి ఆగ్నేయాసియా దేశాలకు చెందిన కార్మికులే సౌదీలో అత్యధికంగా పనిచేస్తున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 1.3 కోట్లమందికి కఠినమైన నిబంధనల నుంచి ఊరట లభించింది. స్పాన్సర్‌షిప్ ఆధారంగా విదేశీ కార్మికులను నియమించుకునే కఫాలా వ్యవస్థ 1950 నుంచి సౌదీలో అమల్లో ఉంది. గల్ఫ్ ఆయిల్ బూమ్ కాలంలో ఉబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న విదేశీ కార్మికులను నియంత్రించడం కోసం ఈ వ్యవస్థను రూపొందించారు. కఫాలా అనే అరబిక్ పదానికి అర్థం స్పాన్సర్‌షిప్. ఈ విధానంలో ప్రతి విదేశీ కార్మికుడు స్థానిక స్పాన్సర్ అదుపాజ్ఞల్లో ఉండాలి. కఫీల్ అని పిలిచే ఈ స్పాన్సరే విదేశీ కార్మికుడి పని, నివాసం, చట్ట హోదా విషయంలో నిర్ణయాలు తీసుకుంటాడు. స్పాన్సర్లు తమ అదుపులోని కార్మికుల పాస్‌పోర్టులను తమ దగ్గర ఉంచుకోవడంతోపాటు వారికి భత్యాలను సకాలంలో చెల్లించేవారుకాదు. విదేశీ కార్మికుల కదలికలపై ఆంక్షలు విధించేవారు.
Updated Date - Oct 23 , 2025 | 05:33 AM