Putins High Security: రాజు వెడలె..
ABN, Publish Date - Dec 05 , 2025 | 02:09 AM
దేశాధ్యక్షుడంటే రాజుతో సమానం! కానీ.. అందరి వైభోగం ఒకేలాగా ఉండదు!! చిన్నదేశాల అధ్యక్షుల పర్యటనలైతే.. ఎప్పుడొచ్చారో, ఎప్పుడెళ్లారో..
దేశాధ్యక్షుడంటే రాజుతో సమానం! కానీ.. అందరి వైభోగం ఒకేలాగా ఉండదు!! చిన్నదేశాల అధ్యక్షుల పర్యటనలైతే.. ఎప్పుడొచ్చారో, ఎప్పుడెళ్లారో.. అనే విషయం కూడా సామాన్య జనానికి పెద్దగా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతాయ్! కానీ.. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాల అధ్యక్షుల పర్యటనలంటే మామూలుగా ఉండదు. వేరే లెవెల్ అంతే!! ఏంటా లెవెల్ అంటే.. ప్రస్తుతం మనదేశంలో పర్యటిస్తున్న పుతిన్ వైభోగాన్నే చూడండి..
పుతిన్ భద్రతా వలయం.. శత్రుదుర్భేద్యం..
రష్యా అధ్యక్షుడు తమ దేశానికి పర్యటనకు వస్తున్నారంటే.. ఏ దేశమైనా అత్యంత పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది! అయితే, వాటికి అదనంగా రష్యా ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. పుతిన్ పర్యటనకు చాలా రోజుల ముందే.. ఆ దేశానికి చెందిన ‘ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (ఎఫ్‌ఎ్‌సవో)’ రంగంలోకి దిగిపోతుంది. పర్యటన ఆద్యంతం భద్రతా ఏర్పాట్ల ప్రణాళికను అత్యంత కచ్చితత్వంతో రచిస్తుంది. ఐదంచెల భద్రతను ఆయన చుట్టూ ఏర్పరుస్తుంది. దానికితోడు.. రష్యా గూఢచార సంస్థ కేజీబీ ప్రోటోకాల్స్‌తో.. స్నైపర్లు, డ్రోన్ ఆపరేటర్లు, ఎలకా్ట్రనిక్ ఇంటెలిజెన్స్ నిపుణులు, కమ్యూనికేషన్ యూనిట్స్‌తో కంటికి కనిపించని శత్రుదుర్భేద్యమైన మరో భద్రతావలయాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇక.. పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని.. ‘ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌బీపీ)’ నుంచి ఎంపిక చేస్తారు. వీరంతా సుశిక్షితులైన కమాండోలు. ఎస్‌బీపీకి ఎంపిక కావాలంటే.. 35 ఏళ్లలోపు వారై ఉండాలి. 180 సెంటీమీటర్ల కన్నా ఎత్తు ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా పోరాటానికి సన్నద్ధంగా ఉండాలి. విదేశీ భాషలు వచ్చి ఉండాలి. ఈ ఎస్‌బీపీలోకి తీసుకునేవారి నేపథ్యాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అధ్యక్షుడి పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారని పూర్తిస్థాయిలో నిర్ధారించుకున్నాకే వారిని విధుల్లోకి తీసుకుంటారు.
ఆ విమానం.. ఎగిరే క్రెమ్లిన్
మాస్కోలోని రష్యా అధ్యక్షుడి కార్యాలయాన్ని ‘క్రెమ్లిన్’ అంటారు! మరి పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు? ఆయన ప్రయాణించే విమానమే అధ్యక్ష భవనం అవుతుంది. అందుకే దాన్ని ‘ఫ్లైయింగ్ (ఎగిరే) క్రెమ్లిన్’గా వ్యవహరిస్తారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానానికి దీటుగా ఉండేలా ఈ ఇల్యూషిన్ ఐఎల్ 96-300 పీయూ విమానాన్ని రూపొందించారు. శత్రుదేశాల రాడార్లు, క్షిపణి వ్యవస్థలకు దొరకకుండా దీంట్లో జామింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఒక స్థాయి వరకు క్షిపణి దాడులను తట్టుకునేలా కవచం ఉంటుంది. నేరుగా శాటిలైట్ల అనుసంధానంతో కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. లోపలిభాగంలో విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. అధ్యక్షుడికి ప్రైవేటు బెడ్‌రూమ్, ఆఫీసు గది, రెండు కాన్ఫరెన్స్ గదులు, అతిథుల కోసం ఒక గది, మినీ జిమ్, కిచెన్, భోజనాల గది, చిన్న బార్, బాత్రూమ్‌లు ఉంటాయి. అంతేకాదు బయటి నుంచి చూస్తే అచ్చం ఈ విమానాన్ని పోలినట్టే మరో విమానం కూడా ఉంటుంది. పుతిన్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ విమానాలు వేర్వేరు మార్గాల్లో ప్రయాణం ప్రారంభిస్తాయి. అధ్యక్షుడు ఎందులో ఉన్నారో శత్రువులకు చిక్కకుండా ఉండాలన్నదే దీని ఉద్దేశం.
పూప్‌కేస్
మనం ఏదైనా ఊరెళ్లేటప్పుడు సూట్‌కేస్ తీసుకెళ్తాం. పుతిన్ మాత్రం.. పూప్‌కేస్ కూడా తన వెంట తీసుకెళ్తారు! పూప్ అంటే తెలుసు కదా.. మలం. రష్యా అధ్యక్షుడు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి మరుగుదొడ్లలో కాలకృత్యాలు తీర్చుకుంటే.. ఆయన మలాన్ని సేకరించి, పరీక్షలు చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విదేశీ గూఢచార సంస్థలు తెలుసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే భద్రతా సిబ్బంది ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటుచేసి, ఆయన మలాన్ని కూడా సేకరించి తమతోపాటు రష్యాకు తీసుకెళ్తారు. అందుకోసం వారు వాడేదే పూప్‌కేస్. ఇప్పుడే కాదు.. పుతిన్ అధికార పగ్గాలు చేపట్టిన 1999 నుంచీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన మలాన్ని ఇలాగే ప్రత్యేక కవర్లలో సేకరించి, పూప్‌కే్‌సలో పెట్టి రష్యాకు తరలిస్తున్నారు!
అప్పట్లో అలా..
వాజపేయి భారత ప్రధానిగా 2001లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు తీసిన ఫొటో ఇది! అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. ఆ పర్యటనకు వెళ్లి, వాజపేయి-పుతిన్ వెనుక నిల్చున్నారు. భారత్‌లో పుతిన్ తాజా పర్యటన నేపథ్యంలో ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పర్యటన గురించి మోదీ ఆ తర్వాతకాలంలో ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. పుతిన్ ఏ క్షణానా.. తనను భారత్‌లోని ఒక రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిలాగానో, తన ప్రాధాన్యం తక్కువని భావించేలాగానో వ్యవహరించలేదని.. అప్పట్నుంచే తమ మధ్య స్నేహపు తలుపులు తెరుచుకున్నాయని తెలిపారు.
వెంట ఫుడ్ ల్యాబ్.. టేస్టర్లు..
పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆయన తినే ఆహారాన్ని పరిశీలించేందుకు చిన్నపాటి ఫుడ్ ల్యాబ్ కూడా వెంట ఉంటుంది. వ్యక్తిగత షెఫ్ కూడా ఉంటారు. స్థానికంగా ఉండే వస్తువులేవీ ఉపయోగించరు. రష్యా నుంచి తెచ్చిన సరుకులతోనే వంట చేస్తారు. ‘ఫుడ్ టేస్టర్’గా పిలిచే బాడీగార్డు ఆహారాన్ని తిని చూశాకే.. పుతిన్ భోజనం చేస్తారు. విష ప్రయోగం, కలుషితం కావడం వంటి జరగకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఇక ట్వొరోగ్‌గా పిలిచే కాటేజ్ చీజ్, కౌజుపిట్ట గుడ్లు, పిస్తా ఐస్‌క్రీమ్‌లను పుతిన్ ఇష్టంగా తింటారు. పండ్ల రసాలు తాగుతారు. సాల్మన్ చేపలు, పొట్టేలు మాంసం, కూరగాయలతో చేసిన సలాడ్ కూడా తీసుకుంటారు.
Updated Date - Dec 05 , 2025 | 02:09 AM