Russia: రష్యా మూడు రోజుల కాల్పుల విరమణ
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:25 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ మే 8 నుంచి 10 వరకు ఉక్రెయిన్‌తో తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్ పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.
మే 8-10 మధ్య రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవాలు
ఈ 3రోజులు ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు పుతిన్ ఆదేశం
కీవ్, ఏప్రిల్ 28: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశ్చర్యకర రీతిలో ఉక్రెయిన్‌తో యుద్ధానికి తాత్కాలికంగా మూడు రోజుల కాల్పుల పాటించాలని తమ సైన్యాలను సోమవారం ఆదేశించారు. మే 8 నుంచి 10 మధ్య కాల్పుల విరమణ ఉంటుందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. నాజీ జర్మనీపై రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా సాధించిన విజయానికి గుర్తుగా మే ఎనిమిదో తేదీ (ఏడో తేదీ అర్ధరాత్రి) నుంచి మే 10 వరకూ కాల్పుల విరమణ కొనసాగుతుందని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు మే 9న విజయోత్సవ దినం (విక్టరీ డే) సందర్భంగా మానవత్వ కోణంలో శత్రువులపై పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తున్నామని పేర్కొంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించడం ఆసక్తికర పరిణామం.
కానీ, ఉక్రెయిన్‌తో పూర్తిస్థాయిలో భేషరతుగా కాల్పుల విరమణకు పుతిన్ నిరాకరించారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటే ఆ దేశానికి ఆయుధాల పంపిణీని, అవసరమైన నిధుల సమీకరణకు పాశ్చాత్య దేశాలు మద్దతు నిలిపేయాలని పుతిన్ మెలిక పెట్టారు. కాగా, ఉక్రెయిన్ కూడా పరస్పరం కాల్పుల విరమణ పాటిస్తుందని క్రెమ్లిన్ ఆశాభావం వ్యక్తంచేసింది. తద్వారా యుద్ధానికి చరమగీతం పాడేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు ఇది ముందడుగు అవుతుందన్న రష్యా సంకేతాలిచ్చింది. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి భేషరతుగా పరస్పరం చర్చలకు సిద్ధమని ప్రకటించడం ఇదే ప్రథమం. కానీ, తమ భూభాగంలోని నాలుగు రీజియన్లను విలీనం చేసుకున్న పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News
Updated Date - Apr 29 , 2025 | 04:25 AM