Modi-Gaza Peace Summit: గాజా శాంతి చర్చలు.. ప్రధాని మోదీకి ఈజిప్టు అధ్యక్షుడి ఆహ్వానం
ABN, Publish Date - Oct 12 , 2025 | 02:19 PM
గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఈజిప్టు వేదికగా రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలంటూ ప్రధాని మోదీని ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానించారు. అయితే, భారత్ తరపున కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఇంటర్నెట్ డెస్క్: గాజాలో శాంతి స్థాపన కోసం రేపు ఈజిప్టులోని షారమ్ అల్ షేక్ వేదికగా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అమెరికాతో కలిసి సంయుక్తంగా ఈజిప్టు ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ ప్రధాని మోదీని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ అధికారికంగా ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశంలో భారత ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొంటారని విదేశాంగ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి (PM Modi Gaza summit invite).
ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా, ఈజిప్టు అధ్యక్షులు సహ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 20 దేశాల అధినేతలు పాల్గొంటారు. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయెల్ మెక్రాన్ పాల్గొంటారు.
గాజాలో యుద్ధాన్ని ముగించి శాంతి నెలకొల్పే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. ఇటీవల ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రధాన్యం ఏర్పడింది. అయితే ఈ సమ్మిట్‌కు ఆదిలోనే హమాస్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. శాంతి ఒప్పందంపై సంతకం చేయబోమని హమాస్ తాజాగా ప్రకటించింది. శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ప్రతిపాదించిన అంశాలకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఆయుధాలు విడిచిపెట్టాలన్న నిబంధనను తాము అస్సలు అంగీకరించబోమని పేర్కొంది. గాజా నుంచి పాలస్తీనా జనాలను మరో చోటకు తరలించాలన్న ప్రతిపాదన అసంబద్ధమని హమాస్ మండిపడింది. అయితే, ట్రంప్ ప్లాన్‌లో భాగంగా 250 మంది ఇజ్రాయెలీ బందీలను విడిచిపెట్టేందుకు తాము సిద్ధమని హమాస్ పేర్కొనడం ఓ సానుకూల అంశం. ఈ నేపథ్యంలో ఈజిప్టులో జరగనున్న శిఖరాగ్ర సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
అఫ్ఘాన్, పాక్ దళాల పరస్పర దాడులు.. 12 మంది పాక్ సైనికుల మృతి
అమెరికా వీడనున్న నోబెల్ బహుమతి గ్రహీతలు.. ట్రంప్ ఆంక్షలే కారణమా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 12 , 2025 | 02:22 PM