Pak-IMF Bailout: నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్
ABN, Publish Date - Dec 12 , 2025 | 03:09 PM
పాక్‌ను ఆర్థికంగా ఆదుకునేందుకు 7 బిలియన్ డాలర్ల భారీ బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించిన ఐఎమ్ఎఫ్ నిధుల విడుదలకు, సంస్కరణలకు ముడిపెట్టింది. అవినీతి నిరోధక చర్యలు, మార్కెట్ సంస్కరణలు చేపట్టాలంటూ ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్ల పాలవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా కునారిల్లుతున్న పాక్‌కు ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్), ప్రపంచబ్యాంకు ఇచ్చే అప్పులే దిక్కు. అయితే, నిధుల విడుదల కోసం ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లకు పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అవినీతి నిరోధక చర్యలు మొదలు మార్కెట్ సరళీకరణ వరకూ ఐఎమ్ఎఫ్ విధుస్తున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్లపాలవుతున్నారు (Pak Bailout - IMF Conditions).
డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఐఎమ్‌ఎఫ్ మొత్తం 7 బిలియన్ డాలర్లను బెయిల్ అవుట్ ప్యాకేజీని ప్రకటించింది. విడతల వారీగా నిధుల విడుదలకు నిర్ణయించిన ఐఎమ్ఎఫ్ పాక్‌పై దశల వారీగా కండీషన్లనూ పెడుతోంది. తాజా విడత నిధుల విధులకు కొత్తగా మరో 11 షరతులు విధించింది. దీంతో, ఇప్పటివరకూ విధించిన మొత్తం షరతుల సంఖ్య 64కు చేరింది. ఐఎమ్ఎఫ్ కండీషన్లను యథాతథంగా పాటించేందుకు పాక్ కేవలం 18 నెలల గడువు మాత్రమే లభించింది.
తాజా నిబంధనల ప్రకారం, పాక్ కేంద్ర ప్రభుత్వ అధికారులు తమ ఆస్తిపాస్తుల వివరాలను బహిరంగ పరచాల్సి ఉంటుంది. త్వరలో ఈ రూల్‌ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విస్తరించనున్నారు. పాక్ సైన్యానికి వంతపాడుతూ అక్రమాలకు పాల్పడే పాక్ పాలకులకు ఈ నిబంధనతో నోట్లో వెలక్కాయపడ్డట్టు అయ్యింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్ఎఫ్ డెడ్‌లైన్ విధించింది. షరతులకు తలొగ్గకపోతే నిధుల రాకడ నిలిచిపోతుంది. నిబంధనలను అమలు చేస్తే అవినీతి, అక్రమాలు బయటపడతాయి. దీంతో పాక్ పాలకులు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.
పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలకు చెక్ పెట్టేందుకు ఐఎమ్ఎఫ్ పలు ఇతర నిబంధనలు కూడా విధించింది. స్థానిక బాండ్ మార్కెట్‌లో సంస్కరణలు, విదేశీ నిధులకు సంబంధించి చెల్లింపులపై ఆంక్షల తొలగింపు వంటివి చేపట్టాలని పాక్‌కు స్పష్టం చేసింది. సైన్యం, అధికారులు కుమ్మక్కు అవుతున్న వైనానికి చెక్ పెట్టేందుకు జాతీయ చక్కెర మార్కెట్ సరళీకరణ విధానాన్ని కూడా సూచించింది. దీంతో పాటు రెవెన్యూ బోర్డు సంస్కరణలు, పన్ను విధానాల్లో మార్పులు, కార్పొరేట్ రంగ నిబంధనల్లో మార్పులు వంటివి పేర్కొంది. ప్రభుత్వ ఆదాయం వచ్చే ఏడాది తగ్గిన పక్షంలో మినీ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. దీంతో, ఐఎమ్ఎఫ్ దూకుడును తట్టుకోలేక పాక్ పాలకులు అల్లాడిపోతున్నారు.
ఇవీ చదవండి:
భారత్‌కు వెళ్లొద్దు.. హెచ్-1బీ వీసాదారులకు ఇమిగ్రేషన్ లాయర్‌ల సూచన
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 12 , 2025 | 03:17 PM