Pak on TRF: టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. పాక్ యూటర్న్
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:31 PM
పహల్గాం దాడికి కారణమైన టీఆర్ఎఫ్‌ను అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు, టీఆర్ఎఫ్ పేరును ఐక్యరాజ్య సమితి ప్రకటనలో చేర్చొద్దని పట్టుబట్టిన ఆయన అమెరికా రంగంలోకి దిగాక యూటర్న్ తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను (టీఆర్ఎఫ్) అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే, టీఆర్ఎఫ్‌కు, లష్కరే తయ్యబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని స్పష్టం చేశారు.
‘అమెరికా ఒక సార్వభౌమ దేశం. టీఆర్ఎఫ్‌ను వారు ఉగ్రసంస్థగా ప్రకటిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ దిశగా ఆధారాలు కూడా బయటపెడితే మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాము’ అని అన్నారు.
ఇంతకాలంగా టీఆర్ఎఫ్‌కు మద్దతుగా ఉన్న పాక్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. పహల్గాం దాడిని ఖండిస్తూ భద్రతా మండలి గతంలో విడుదల చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేసింది. ‘భద్రతా మండలి ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు చేర్చొద్దని అన్నాము. అన్ని దేశాలు మాకు ఈ విషయంలో ఫోన్లు చేశాయి. కానీ మేము పట్టు విడవలేదు’ అప్పట్లో దార్ గొప్పగా చెప్పుకున్నారు. ఉగ్రచర్యల్లో టీఆర్ఎఫ్ పాత్రపై మరిన్ని ఆధారాలు కావాలని కూడా పాక్ పట్టుబట్టింది. తాజా అమెరికా చర్యలపై మాత్రం తమకేమీ అభ్యంతరం లేదని యూటర్న్ తీసుకున్నారు.
ఇక భారత్ ఉపా చట్టం ప్రకారం టీఆర్ఎఫ్‌ను 2023 జనవరిలోనే ఉగ్రసంస్థగా ప్రకటించింది. దక్షిణాసియా టెర్రరిజమ్ పోర్టల్ ప్రకారం, టీఆర్ఎఫ్ 2019లో తొలిసారిగా ఆన్‌లైన్ వేదికల్లో కనిపించింది. జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు తామే బాధ్యులమని చెప్పుకుంది.
ఇవి కూడా చదవండి:
హమాస్‌పై మండిపడ్డ ట్రంప్.. వారి పని ముగించేయాలంటూ ఇజ్రాయెల్‌కు సూచన
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 26 , 2025 | 12:36 PM