Asim Munir: భారత భూభాగంలోనూ దాడులు చేయగలం
ABN, Publish Date - Oct 19 , 2025 | 03:48 AM
సరిహద్దులు దాటి, భారత భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు చేయగలిగేలా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకున్నామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప్రకటించారు.
రెచ్చగొడితే విరుచుకుపడతాం!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రేలాపనలు
‘అణుబూచి’ చూపిస్తూ హెచ్చరికలు
ఇస్లామాబాద్, అక్టోబరు 18: సరిహద్దులు దాటి, భారత భూభాగంలోకి ప్రవేశించి మరీ దాడులు చేయగలిగేలా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకున్నామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప్రకటించారు. ‘గీత దాటలేరు’ అనే భారత నమ్మకాన్ని వమ్ము చేయగలమని హెచ్చరించారు. ఏ చిన్న రెచ్చగొట్టే కార్యక్రమానికి దిగినా.. తీవ్రంగా స్పందిస్తామని భారత్‌ను హెచ్చరించారు. మరోసారి ‘అణు బూచి’ కూడా చూపించారు. ‘అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నప్పుడు యుద్ధానికి చోటు ఉండదని గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. కాకుల్‌లోని పాక్ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన కార్యక్రమంలో మునీర్ భారత్‌ను ఉద్దేశించి పలు ప్రేలాపనలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో తాము స్పష్టమైన విజయాన్ని సాధించామని మునీర్ తెలిపారు. ఇకపై అలాంటి ఏ చిన్న ఘటన ఎదురైనా నిర్ణయాత్మక శక్తితో విరుచుకుపడతామని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. శత్రు దేశం(భారత్) ఆర్థిక, సైనిక నష్టాన్ని భారీగా చవిచూస్తుందని వ్యాఖ్యానించారు. అయితే... ఆపరేషన్ సిందూర్‌తో పాక్ చావుదెబ్బ తినిందని భారత్ ఇదివరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలనూ ప్రపంచంముందుంచింది.
భారత్ ప్రతినిధిగా అఫ్ఘానిస్థాన్!
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. అఫ్ఘానిస్థాన్‌తో పాక్‌కు కొనసాగుతున్న వివాదంలో భారత్ ప్రస్తావనకు తీసుకొచ్చి, లింక్ చేయడం ద్వారా ఉద్రిక్తతలు మరింత రాజేసే ప్రయత్నం చేశారు. కాబూల్ భారత్ ప్రతినిధిగా మారిందని వ్యాఖ్యానించారు. అఫ్ఘానిస్థాన్.. న్యూఢిల్లీ, నిషేధిత తెహ్రీక్-ఐ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)తో కలిసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని ‘ఎక్స్’లో ఆరోపించారు. ఇప్పుడు భారత్ ఒడిలో కూర్చొని తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న అఫ్ఘాన్ పాలకులు.. ఒకప్పుడు తమ రక్షణలో ఉన్నారని, తమ భూభాగంపై ఆశ్రయం తీసుకున్నారన్నారు. అఫ్ఘానిస్థాన్‌తో సంబంఽధాలను ముగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ‘మా దేశంలో నివసిస్తున్న అఫ్ఘాన్లు అందరూ వారి మాతృభూమికి వెళ్లిపోవాలి’ అని పేర్కొన్నారు.
Updated Date - Oct 19 , 2025 | 07:55 AM