ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chief Justice Sushila Karki: నేపాల్‌ తాత్కాలిక అధినేతగా సుశీల కర్కి

ABN, Publish Date - Sep 11 , 2025 | 03:47 AM

యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ..

  • ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టి్‌సను ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు

  • ’దేశవ్యాప్తంగా భద్రత సైన్యం చేతుల్లోకి

  • నిరసనకారులు చర్చలకు రావాలని

  • అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్‌ పిలుపు

  • రాజ్యాంగాన్ని మార్చాలి.. నేతల ఆస్తుల్ని

  • జాతీయం చేయాలి: ఆందోళనకారులు

  • ఢిల్లీలో తెలంగాణ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌

కఠ్మాండూ, సెప్టెంబర్‌ 10: యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు.. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కిని తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఎంపిక చేసుకున్నారు. ఆమె ఆధ్వర్యంలోనే సైన్యంతో చర్చలు జరపాలని నిర్ణయించారు. నేపాల్‌లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనలను నియంత్రించేందుకు నేపాల్‌ సైన్యం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుంది. ఆందోళనలపై ఆంక్షలు విధించింది. గురువారం ఉదయం వరకు అమల్లో ఉండేలా కర్ఫ్యూ ప్రకటించింది. ఆందోళనకారులే కాదు ప్రజలెవరూ బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు దోపిడీలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని.. సాధారణ ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకే కర్ఫ్యూ తదితర చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. ఆందోళన సమయంలో ఎత్తుకుపోయిన తుపాకులు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలను సమీపంలోని పోలీస్‌ స్టేషన్లలో అప్పగించాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. శాంతిని పునరుద్ధరించడంలో ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. సైన్యం చేపట్టిన చర్యలతో బుఽధవారం నేపాల్‌ రాజధాని కాఠ్మండూ నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా సాయుధ బలగాలు కాపలా కాస్తూ కనిపించాయి. ఇక వ్యాపార సంస్థల్లో దోపిడీలు, ఆయుధాల అపహరణ, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన 27 మందిని అరెస్టు చేశామని, 31 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనల సమయంలో నేపాల్‌లోని జైళ్ల నుంచి 13.5 వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్టు నేపాల్‌ పోలీసులు ప్రకటించారు. వారిలో కొందరు సరిహద్దుల మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అలా వస్తున్న ఐదుగురిని భారత బలగాలు పట్టుకుని నేపాల్‌కు అప్పగించాయి. ఇక బైజ్‌నాథ్‌ పట్టణంలో తప్పించుకునే క్రమంలో ఐదుగురు బాల నేరస్తులు మరణించారు. కాగా, ఆందోళనకారుల దాడి భయంతో నేపాల్‌ మంత్రి భండారీ అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఇంట్లోనే వదిలేసి పారిపోయారు. ఆయన కోసం వచ్చిన ఆందోళనకారులు.. ఆమె దుస్థితి చూసి, తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించడం గమనార్హం.

చర్చలకు రావాలని పిలుపు

ఇంకా రక్తపాతం వద్దని, తమ డిమాండ్లపై చర్చలకు రావాలని ఆందోళనకారులకు నేపాల్‌ అధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్‌ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉండాలని, దేశానికి మరింత నష్టం కలగకుండా చూడాలని కోరారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌ కూడా ఆందోళనకారులు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆందోళనల్లో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభం

నేపాల్‌లోని కీలకమైన త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలను బుధవారం సాయంత్రం నుంచి పునర్ధురించారు. అల్లర్లతో నేపాల్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు, పర్యాటకులు తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. నేపాల్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు సమీపంలోని పోలీస్‌ స్టేషన్లతో, విమాన యాన సంస్థలతో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఆ ఒక్క ప్రమాదంతో.. ఆగ్రహం అగ్నిపర్వతమైంది!

సోషల్‌ మీడియా వేదికలపై నేపాల్‌ ప్రభుత్వం నిషేధం విధించడంపై మొదట సాధారణంగా నిరసనలు సాగాయి. ‘జనరేషన్‌ జెడ్‌’ పేరుతో యువత ర్యాలీలు తీశారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 6న ఆ దేశ మంత్రి రామ్‌ బహదూర్‌ ప్రయాణిస్తున్న కారు 11 ఏళ్ల ఉషా మగర్‌ అనే బాలికను ఢీకొట్టింది. ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ మంత్రి పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది. దీనికితోడు ‘‘ఇలాంటి ప్రమాదాలు మామూలే. ఆమెకు తగిన వైద్యం చేయిస్తాం’’ అని ప్రధాని కేపీ శర్మ ఓలి చులకనగా మాట్లాడటంతో యువతలో ఆగ్రహం పెల్లుబికింది. అప్పటికే ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి, నిరుద్యోగంతో నెలకొన్న ఆగ్రహం ఈ పరిణామాలతో అగ్నిపర్వతంలా మారింది.

నేపాల్‌లో చిక్కుకున్న మాడభూషి శ్రీధర్‌

నేపాల్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులు చిక్కుకుపోయారు. వేర్వేరు పనుల నిమిత్తం నేపాల్‌ వెళ్లిన కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరూప్‌ రెడ్డి.. ఆందోళనకర పరిస్థితుల వల్ల అక్కడ హోటళ్లలో తలదాచుకున్నారు. మాడభూషి శ్రీధర్‌ కుటుంబంతో సహా మొత్తం 27 మంది హైదరాబాద్‌ నుంచి తీర్థయాత్రలకు నేపాల్‌ వెళ్లారు. తాము కాఠ్‌మాండూ దగ్గరలో ఉన్న హోటల్‌లో క్షేమంగా ఉన్నట్లు శ్రీధర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

నేపాల్‌ తొలి మహిళా చీఫ్‌ జస్టిస్‌ సుశీల

నేపాల్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌గా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కిని ఆందోళనకారులు ఎన్నుకున్నారు. ఆందోళనకారుల గ్రూపులు, నిర్వాహకుల మధ్య సుమారు 4గంటల పాటు వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు కాఠ్మండూ స్థానిక వార్తా సంస్థ ‘ఖబర్‌హబ్‌’ వెల్లడించింది. నేపాల్‌ సుప్రీంకోర్టుకు మొదటి మహిళా చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కి. 2016 జూలైలో బాధ్యతలు చేపట్టిన ఆమె పలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. ముఖ్యంగా సీనియారిటీని పట్టించుకోకుండా చేసిన పోలీస్‌ చీఫ్‌ నియామకాన్ని కొట్టివేశారు. పాలన వ్యవస్థలో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ అప్పటి ప్రభుత్వం.. సుశీల కర్కిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. కానీ అది ఆమోదం పొందలేదు. 2017 జూన్‌లో సుశీల రిటైరయ్యారు. నేపాల్‌లోని బిరాత్‌నగర్‌లో 1952లో జన్మించిన సుశీల కర్కి.. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ డిగ్రీ చేశారు. తర్వాత నేపాల్‌లోని త్రిభువన్‌ వర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. చాలాకాలం మానవ హక్కుల సంఘాల్లో సభ్యురాలిగా పనిచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు పొందారు.

Updated Date - Sep 11 , 2025 | 05:41 AM