Nepal Appoints First Woman Interim PM: నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి
ABN, Publish Date - Sep 13 , 2025 | 03:27 AM
జెనరేషన్ జెడ్ యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి....
రాత్రి 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం
ఆ వెంటనే కీలక అధికారులతో భేటీ
వచ్చే ఏడాది మార్చి 4న ఎన్నికలకు ప్రతిపాదన
అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా నేపాల్‌లో ఎమర్జెన్సీకి సిఫారసు
ప్రభుత్వంలో చేరని ‘జెన్ జెడ్’ ప్రతినిధులు
హోటల్‌కు నిరసనకారుల నిప్పు.. కిందికి దూకిన భారతీయురాలి మృతి
భారతీయ పర్యాటకుల బస్సుపై రాళ్లు
కాఠ్మండూ, సెప్టెంబరు 12: ‘జెనరేషన్ జెడ్’ యువత ఆందోళనలతో అట్టుడికిన నేపాల్‌లో పరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి బాధ్యతలు చేపట్టారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయంలో అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌదెల్, ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్‌తో జెన్ జెడ్ గ్రూపుల ప్రతినిధులు శుక్రవారం జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారానికి వచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి 9.30గంటలకు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కితో అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌదెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ యాదవ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకాశ్‌సింగ్ రావత్, ఆర్మీ చీఫ్, ఇతర కీలక నేతలు, అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత పార్లమెంటును రద్దు చేస్తున్న నేపథ్యంలో పాలన సజావుగా కొనసాగానికి వీలుగా పది మంది మంత్రులను నియమించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు తాము ప్రభుత్వంలో చేరబోమని, ప్రభుత్వ పనితీరును తమ సలహా కమిటీ పర్యవేక్షించి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తుందని ‘జెన్ జెడ్’ గ్రూపుల ప్రతినిధులు స్పష్టం చేసినట్టు తెలిసింది.
సుదీర్ఘ చర్చల తర్వాత ఖరారు..
యువత ఆందోళనల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కితోపాటు కాఠ్మండూ మేయర్ బాలేంద్ర షా, నేపాల్ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ సీఈవో కుల్మన్ ఘీసింగ్, మేయర్ హర్కా సంపంగ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. గురువారం ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఏమీ తేలలేదు. శుక్రవారం రాత్రి వరకు దేశాధ్యక్ష కార్యాలయంలో చర్చలు జరిగాయి. చివరికి సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారు. 73ఏళ్ల సుశీల కర్కి నేపాల్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తికాగా, ఇప్పుడు తొలి మహిళా ప్రధాని కూడా ఆమెనే కావడం విశేషం.
అధ్యక్షుడి విశేషాధికారాల మేరకు..
నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం.. పార్లమెంటు సభ్యుడై ఉండి, మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నవారే ప్రధానమంత్రి అవుతారు. ప్రస్తుతం నేపాల్ పార్లమెంటును రద్దు చేసిన నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 ప్రకారం అధ్యక్షుడికి దఖలు పడిన విశేషాధికారాల మేరకు తాత్కాలిక ప్రధానిగా సుశీలను నియమిస్తూ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌదెల్ ఉత్తర్వులు జారీ చేశారు.
దేశంలో ఎమర్జెన్సీ..
తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సుశీల కర్కి.. ఉన్నతాధికారులతో తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. నేపాల్‌లో ఆరు నెలల్లోగా సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 4వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రతిపాదించారు. ఇక దేశంలో అధికార మార్పిడి ప్రశాంతంగా జరిగేలా, దేశంలో పరిస్థితులు చక్కబడేలా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా.. నేపాల్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని అధ్యక్షుడికి తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి సిఫారసు చేసినట్టు తెలిసింది.
రాజకీయ పక్షాల నిరసనలు
నేపాల్ ప్రస్తుత పార్లమెంటును రద్దుచేయాలన్న ప్రతిపాదనను నిరసిస్తూ.. రాజకీయ పక్షాలు శుక్రవారం ఆ దేశ అధ్యక్ష కార్యాలయం బయట ఆందోళనకు దిగాయి. ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్-యూఎంఎల్) ప్రధాన కార్యదర్శి శంకర్ పొఖారెల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇక తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ఎంపిక రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ మావోయిస్టు పార్టీ నేత దేవేంద్ర పౌడెల్ మండిపడ్డారు. మరోవైపు.. ఆ దేశ పార్లమెంటు దిగువ సభ స్పీకర్ దేవ్‌రాజ్ ఘిమిరే (సీపీఎన్-యూఎన్‌ఎల్), ఎగువ సభ చైర్‌పర్సన్ నారాయణ్ దహాల్ (మావోయిస్టు పార్టీ) ఇద్దరూ కూడా సుశీల కర్కి ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. నేపాల్‌లో రాజకీయపరంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటోందని, దానికి ఇది సూచన అని విశ్లేషకులు చెబుతున్నారు.
51కి చేరిన మృతుల సంఖ్య..
జనరేషన్ జెడ్ యువత ఆందోళనలు, పోలీసుల కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య 51కి చేరింది. ఇందులో కాఠ్మండూలో ఆందోళనలు జరిగిన ప్రధాన ప్రాంతాల్లో 34 మంది మరణించగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 17 మంది మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మొత్తంగా 1,700 మందికిపైగా గాయపడ్డారని, ప్రస్తుతం 700 మందికిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీ్‌సస్టేషన్లు, ఇతర భద్రతా ఏర్పాట్లను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు.
‘డిస్కార్డ్’ యాప్‌తో తాత్కాలిక ప్రధాని ఎంపిక!
నేపాల్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టిన ‘జనరేషన్ జెడ్’ యువత.. తమ తరానికి తగినట్టే తాత్కాలిక ప్రధానిని ఆన్‌లైన్‌లో ఎంచుకున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడేవారికి సంబంధించి ‘డిస్కార్డ్’ చాటింగ్ యాప్‌ను వేదికగా చేసుకున్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరైతే బాగుంటుందనే దానిపై లక్ష మందికిపైగా యువత ఈ యాప్‌లో వాడివేడి చర్చలు జరిపి, పోల్స్ నిర్వహించి.. చివరికి మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి పేరును ఖరారు చేశారు. దీనిపై సిద్ ఘిమిరి అనే కంటెంట్ క్రియేటర్ మాట్లాడుతూ.. ‘‘నేపాల్ పార్లమెంటు ప్రస్తుతం డిస్కార్డ్‌లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ అంశాలతో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. నిజానికి డస్కార్డ్ చాట్ యాప్ 2015లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఏదైనా చానల్ సృష్టించి.. ఒకేసారి లక్షల మంది చాట్ చేయడానికి వీలుంటుంది.
భారతీయుల బస్సుపై దాడి
కాఠ్మండూలోని పశుపతినాథ్ ఆలయానికి వెళ్లి వస్తున్న తెలుగువారి బస్సుపై ఆందోళనకారులు దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కర్ఫ్యూతో నేపాల్‌లో చిక్కుకుపోయిన ఈ బస్సు.. గురువారం రాత్రి భారత్, నేపాల్ సరిహద్దుల్లోని సనౌలి వద్దకు చేరుకున్నాక బస్సులోని సిబ్బంది శ్యామూ నిషాద్ ఈ వివరాలు వెల్లడించారు. ‘‘9న పశుపతినాథ్ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నాం. బస్సులో వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా 49 మంది ఉన్నారు. మధ్యలో కొందరు ఆందోళనకారులు మా బస్సుపై రాళ్లు రువ్వారు. కిటికీల అద్దాలు పగిలి ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నేపాల్ ఆర్మీ వచ్చి మాకు సాయం చేసింది’’ అని తెలిపారు.
హోటల్ నాలుగో అంతస్తు నుంచి దూకి..
నేపాల్ ఆందోళనల్లో భారత మహిళ ఒకరు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాజేశ్ గోలా, ఆమె భర్త రామ్‌వీర్ సింగ్ గోలా కలిసి ఈ నెల 7న నేపాల్ పర్యటనకు వెళ్లారు. కాఠ్మండూలోని హయత్ రెసిడెన్సీ హోటల్‌లో బస చేశారు. ఈ నెల 9న ఆందోళనకారులు ఆ హోటల్‌కు నిప్పుపెట్టారు. సహాయక బృందాలు అక్కడికి చేరుకుని హోటల్‌లో చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో హోటల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకిన రాజేశ్ గోలాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భర్తకూడా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డారు.
హోటల్ రంగానికి రూ.2,500 కోట్ల నష్టం
జనరేషన్ జెడ్ ఆందోళనలు, అనంతర పరిస్థితులతో నేపాల్‌లోని హోటల్ రంగానికి రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (హాన్) అంచనా వేసింది. చాలా హోటళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయని.. కాఠ్మండూలోని ప్రముఖ హిల్టన్ హోటల్‌ను ఆందోళనకారులు తగలబెట్టడంతోనే రూ.800 కోట్ల నష్టం కలిగిందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు
చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడి ఫొటోను రిలీజ్ చేసిన ఎఫ్‌బీఐ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 13 , 2025 | 03:27 AM