Yugoslavia conflict: డబ్బులిచ్చి మనుషుల్ని వేటాడారు!
ABN, Publish Date - Nov 14 , 2025 | 03:53 AM
చుట్టూ కొండలు.. మధ్యలో ఊరు! కొండల మధ్యన రైఫిళ్లతో మాటువేసిన స్నైపర్లు. గుక్కెడు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా.. బుక్కెడ బువ్వ కోసం పనికి వెళ్లాలన్నా.. రోడ్డుమీదకు వెళ్లాల్సిందే! కానీ..
బోస్నియాలో ఇటాలియన్ సంపన్నుల వారాంతపు స్నైపర్ టూరిజం
1992-95 నడుమ నాలుగేళ్లపాటు సాగిన దారుణ మారణకాండ
మిలాన్, నవంబరు 13: చుట్టూ కొండలు.. మధ్యలో ఊరు! కొండల మధ్యన రైఫిళ్లతో మాటువేసిన స్నైపర్లు. గుక్కెడు మంచినీళ్లు తెచ్చుకోవాలన్నా.. బుక్కెడ బువ్వ కోసం పనికి వెళ్లాలన్నా.. రోడ్డుమీదకు వెళ్లాల్సిందే! కానీ.. అలా వెళ్తే ఏ పక్క నుంచి ఏ రైఫిల్ తూటా వచ్చి ఒంట్లో దిగబడుతుందో తెలియదు. 1992లో యుగోస్లావియా నుంచి బోస్నియా స్వతంత్ర దేశంగా విడివడ్డ తర్వాత.. ఆ దేశ రాజధాని సారయేవోలో ప్రజలు అనుభవించిన నరకం ఇది! బోస్నియా అలా స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని జీర్ణించుకోలేని ఆర్థోడాక్స్ సెర్బులు.. సారేయేవో నగరాన్ని 1425 రోజులపాటు(దాదాపు 4 సంవత్సరాలపాటు) ముట్టడించి ఆ నగరంలోని ప్రజలపై సాగించిన దారుణ నరమేధమిది! ఇంకా దారుణం ఏంటంటే.. సారయేవో ప్రజలపై సెర్బులు సాగించిన మారణకాండలో ఇటలీకి చెందిన అత్యంత సంపన్నులు కూడా పాలుపంచుకున్నారని ఇటీవల వెల్లడైంది. బోస్నియన్లను స్నైపర్లతో కాల్చిచంపే అవకాశం కోసం వారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ముట్టజెప్పేవారని(ఇలా వెళ్లడాన్ని స్నైపర్ టూరిజంగా వ్యవహరించేవారు), సరదా కోసం వారాంతాల్లో మనుషులను వేటాడేవారని ఎజియో గవజెనీ అనే పాత్రికేయుడి ఫిర్యాదు మేరకు.. ఇటలీలోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దీనిపై తాజాగా దర్యాప్తు చేపట్టింది. ఇటాలియన్లతోపాటు.. అమెరికా, రష్యా ఇతర దేశాలకు చెందిన ధనవంతులు కూడా ఈ అకృత్యానికి పాల్పడేవారని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లావియా నుంచి.. 1992మార్చిలో బోస్నియా-హెర్జెగోవినా స్వాతంత్య్రం ప్రకటించుకుంది. అయితే, బోస్నియాలోని ఆర్థొడాక్స్ క్రిస్టియన్ సెర్బులు దీన్ని వ్యతిరేకించారు. బోస్నియా ఉంటే యుగోస్లావియాలో ఉండాలి లేదా సెర్బియాలో కలవాలి అని కోరుకున్నారు. రాడోవాన్ కరాడ్జిచ్ నేతృత్వంలో 1992 ఏప్రిల్ 5న సారయేవోను ముట్టడించారు. నగరం చుట్టూ ఉన్న కొండల్లో మాటువేసి పౌరులపై స్నైపర్‌తో కాల్పులు జరిపేవారు. ఆ నగరానికి విద్యుత్తు, నీరు, ఆహారం అందకుండా చేశారు. దీంతో సారయేవో పౌరల జీవితం నరకప్రాయమైంది. తిండి కోసమో, పనికోసమో బయటకు వెళ్లాలంటే.. నగరంలోని రెండు ప్రధాన రహదారుల గుండా వెళ్లాల్సి వచ్చేది. వాటిలో ఒకటి డ్రాగన్ ఆఫ్ బోస్నియా స్ట్రీట్.. రెండోది మోసా సెలిమోవిక్ బొలివర్డ్. దీంతో.. సెర్బు స్నైపర్లు ఈ వీధులనే లక్ష్యంగా చేసుకుని మాటువేసేవారు. వాటి గుండా వెళ్లే పౌరులను.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తమ గురికి చిక్కే ప్రతి ఒక్కరినీ తూటాలు దింపి చంపేసేవారు. ఆ వీధుల్లో వెళ్లాలంటే పౌరులు ఐక్యరాజ్యసమితి వాహనాలు వచ్చేదాకా ఆగి.. వాటి వెనుక నక్కినక్కి వెళ్లేవారు. నాలుగేళ్లపాటు ఆ నరకప్రాయమైన జీవితాన్ని గడిపారు. ఇలా వెళ్లే వారిని చంపడానికే ఇటాలియన్ సంపన్నులు పెద్ద ఎత్తున (ఇప్పటి లెక్కల ప్రకారమైతే.. రూ.కోటి దాకా) డబ్బులిచ్చి మరీ అక్కడికి వెళ్లేవారు. అక్కడికెళ్లాక.. చిన్నారులను చంపడానికి ఈ సంపన్నులు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించేవారని.. వృద్ధులను ఉచితంగా కాల్చేందుకు సెర్బులు అనుమతించేవారని చెబుతారు. బోస్నియాకు చెందిన సైనిక నిఘా అధికారి ఒకరు ఇటీవలే ఈ మేరకు సాక్ష్యం ఇచ్చారు. నిజానికి ఆ అధికారి ఆ విషయాన్ని 1994 మొదట్లోనే ఇటలీ సైనిక నిఘా అధికారులకు తెలపగా.. ఇటలీ సైన్యం స్నైపర్ టూరిజానికి చెక్ పెట్టింది. కాగా.. సారయేవో ముట్టడిలో 11,500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో 1600 మందికి పైగా పిల్లలున్నారు. ఎట్టకేలకు 1995 చివర్లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆధ్వర్యంలో కుదిరిన డేటన్ శాంతి ఒప్పందం ద్వారా సారయేవో ముట్టడికి తెరపడింది.
Updated Date - Nov 14 , 2025 | 03:53 AM