Israel Missile stocks: తరిగిపోతున్న క్షిపణి నిల్వలు .. ఒత్తిడిలో ఇజ్రాయెల్
ABN, Publish Date - Jun 20 , 2025 | 09:28 AM
ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు క్షిపణులను ఇజ్రాయెల్ విరివిగా వినియోగిస్తుండటంతో వాటి నిల్వలు తరిగిపోతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరో 12 రోజులకు సరిపడా యారో క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్(Israel) ఒత్తిడిలో కూరుకుపోతోందా? మందుగుండు సామగ్రి నిల్వలు తగ్గుతుండటంతో ఇక్కట్ల పాలవుతోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఇరాన్ (Iran) హైపర్ సానిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ యారో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ను వినియోగిస్తోంది. ప్రస్తుతం వీటి నిల్వలు కేవలం 12 రోజులకు మాత్రమే సరిపోతాయి (Arrow Interceptor Missile Shortage). అటుపై ఇరాన్ దాడులను తిప్పి కొట్టడం ఇజ్రాయెల్‌కు తలకు మించిన భారంగా మారనుంది. ఆయుధ సంపత్తి సరఫరాను అమెరికా పెంచకపోతే ఇరాన్‌ను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు సవాలుగా మారే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఒక్క రోజులో 285 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఒక్కో యారో క్షిపణి ఖరీదు 3 మిలియన్ డాలర్లు. ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, యారో గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు అమెరికా అందించిన పాట్రియట్, థాడ్ వ్యవస్థలను కూడా ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ఇరాన్ దాడులు పెరగడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి ఎక్కువవుతోంది.
ఇరాన్ వద్ద సుమారు 2 వేల వరకూ వివిధ రకాల మిసైల్స్ ఉన్నాయి. దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ఇప్పటికే ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. వీటిల్లో కొన్ని ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలను ధ్వంసం చేయగలిగాయి. రాజధాని టెల్ అవీవ్ లోని మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. ఆ తరువాత రెండు రోజులకు మరో క్షిపణి దాడిలో హఫియాలోని చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది. దీంతో, కార్యకలాపాలకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ భవనం కూడా ఇరాన్ క్షిపణుల బారిన పడినట్టు పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇబ్బందుల్లో ఉన్న ఇజ్రాయెల్‌ను ఆదుకునేందుకు అమెరికా ఇప్పటికే సైలెంట్‌గా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. భూ, జల, గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్‌కు అనుకూలంగా మోహరించింది. యూఎస్ నేవీ డెస్ట్రాయెర్లు ఇప్పటికే పలు ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తరుగుతున్న యారో మిసైల్ నిల్వలపై ఇజ్రాయెల్ సైన్యం కానీ, రక్షణ రంగ సంస్థలు కానీ స్పందించలేదు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మాత్రం సైన్యం ప్రకటించింది.
‘ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటూ రోజంతా గడిపేయడం ఇజ్రాయెల్‌కు, అమెరికాకు ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. కాబట్టి, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలు వేగంగా స్పందించి సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనాలి’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని మిసైల్ డిఫెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ టామ్ కరాకో వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
ఖలిస్థానీలపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదిక
ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా.. తేదీ ఖరారైనట్టేనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 20 , 2025 | 09:45 AM