Share News

Khalistani Extremism: ఖలిస్థానీలపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదిక

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:07 PM

కెనడాను తమ స్థావరంగా మార్చుకున్న అతివాద ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత్‌లో హింసను ప్రోత్సహిస్తున్నారని కెనడా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారిక నివేదికను విడుదల చేసింది.

Khalistani Extremism: ఖలిస్థానీలపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదిక
Khalistani extremists Canada

ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీలపై (Khalistani Extremism) భారత్ ఎంతో కాలంగా చేస్తున్న ఆరోపణలు వాస్తవమని కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. కెనడాను తమ స్థావరంగా మార్చుకుని ఖలిస్థానీలు భారత్‌లో హింసను ప్రేరేపిస్తున్నారని కెనడా నిఘా సంస్థ సీఎస్ఐఎస్ (Canada Intelligence Agency) అధికారికంగా నివేదిక వెలువరించింది. కెనడాలో నిధులు సమీకరించి, ప్రణాళికలు రచించి భారత్‌లో హింసను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంది.

1980ల నుంచే ఖలిస్థానీలు కెనడాను స్థావరంగా మార్చుకున్నారని కెనడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రాజకీయ లక్ష్యాలతో హింసను ప్రేరేపిస్తున్నారని తెలిపాయి. హింస ద్వారా భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. అయితే, హింసను ప్రోత్సహిస్తున్న వారితో పాటు శాంతియుత మార్గాల్లో ఉన్న ఖలిస్థానీలు కూడా ఉన్నారని కెనడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌పై దాడుల ప్రణాళికలు రచించేందుకు, హింసను ప్రోత్సహించేందుకు ఈ అతివాదులకు కెనడా స్వర్గ ధామంగా మారిందని చెప్పాయి. అయితే, ఖలిస్థానీ ఉద్యమ అణిచివేతకు కెనడాలో భారత్ జోక్యం గురించి కూడా కెనడా నిఘా నివేదికలో ప్రస్తావించారు.


ఇటీవల జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీతో కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కెనడా నిఘా నివేదిక విడుదల కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా, దౌత్య బంధాన్ని పునరుద్ధరించేందుకు మోదీ, కార్నీ అంగీకరించారు.

ఇక జీ7 సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం సముచితమని ప్రధాని కార్నీ పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయంగా భారత్ ప్రాముఖ్యత గల దేశమని, నిర్మాణాత్మక చర్చలు అవసరమని పేర్కొన్నారు. అతివాద ఖలిస్థానీలు గతేడాది కెనడాలో ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకపోయినా కూడా దేశీయ భద్రత దృష్ట్యా వారి ఉనికి కెనడా ప్రభుత్వ సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది.


ఖలిస్థానీ వేర్పాటు వాది హర్దీప్ నిజ్జర్ హత్య తరువాత కెనడా, భారత్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగిన విషయంలో తెలిసిందే.

ఇవీ చదవండి:

ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా.. తేదీ ఖరారైనట్టేనా

36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 03:13 PM