Israel-Iran conflict: మూడో రోజూ ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు
ABN, Publish Date - Jun 15 , 2025 | 08:16 PM
ఇరాన్-ఇజ్రాయెల్ శత్రుత్వం 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుంచి మొదలైంది. అప్పటి నుంచీ ఇరాన్.. ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం నేటికి మూడో రోజుకి చేరింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అంతేకాదు, ఇవి.. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న శత్రుత్వాన్ని బహిరంగ యుద్ధంగా మార్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ శత్రుత్వం 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుంచి మొదలైంది. అప్పటి నుంచీ ఇరాన్.. ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది. హమాస్, హెజ్బొల్లా, ఇంకా.. హౌతీల వంటి ఇజ్రాయెల్ వ్యతిరేక సమూహాలకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఇక, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని తన ఉనికికి ముప్పుగా భావిస్తోంది.
శుక్రవారం జూన్ 13, 2025న ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది. తమ దేశానికి తీవ్రమైన ముప్పుగా భావిస్తున్న అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు జరిపింది. ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు సౌకర్యాలు.. నటాంజ్‌లోని అణు సమృద్ధీకరణ ప్లాంట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. ఫలితంగా ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, టెహ్రాన్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనాలు కుప్పకూలాయి. షహరాన్ ఆయిల్ డిపో, టెహ్రాన్‌లోని గ్యాస్ డిపో భారీ నష్టానికి గురయ్యాయి. దాదాపు 200కు పైగా యుద్ధ విమానాలు, డ్రోన్లుతో ఇరాన్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఫలితంగా ఇరాన్‌లో 78 మంది మరణించారని, 320 మందికి గాయాలయ్యాయని ఇరాన్ ఐక్యరాజ్య సమితి రాయబారి తెలిపారు. ఇందులో సామాన్య పౌరులు, పిల్లలు కూడా ఉన్నారు.
దీంతో ఇరాన్ జూన్ 13, 14 తేదీల్లో ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడులు చేపట్టింది. 100 కంటే తక్కువ బాలిస్టిక్ మిస్సైల్స్, 100కు పైగా డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా, రిషోన్ లెజియోన్‌లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అయితే, కొన్ని మిస్సైల్స్.. రిషోన్‌లోని నివాస ప్రాంతాలను, టెల్ అవీవ్‌లోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లను తాకాయి. దీంతో ఇజ్రాయెల్‌లో కనీసం 13 మంది మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. అయితే, ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ, అలాగే అమెరికా, బ్రిటన్, జోర్డాన్ సైనిక సహాయంతో చాలా మిస్సైల్స్‌ను అడ్డుకుని నష్టాన్ని కొంతమేర నివారించుకుంది. ఇరాన్ దాడుల్లో 10 మంది మరణించారు. దీంతో యుద్ధ తీవ్రత మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించారు. కొత్త అణు ఒప్పందానికి అంగీకరించడం ద్వారా మాత్రమే ఇరాన్ మరింత విధ్వంసం నివారించగలదని హెచ్చరించారు. అయితే, ఈ నేపథ్యంలో ఆదివారం ఒమన్‌లో జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. ఇవి అర్థరహితమైన చర్చలని ఇరాన్ విమర్శించింది. కొన్ని రోజులుగా ఇరాన్- అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ ఇరుదేశాల మధ్య 5 భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒమన్‌లో ఆదివారం జరగాల్సిన ఆరో విడత చర్చలను రద్దు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు
Updated Date - Jun 15 , 2025 | 08:37 PM