Iran Faces Protests as Currency Plummets: కరెన్సీ పతనం.. అట్టుడుకుతున్న ఇరాన్!
ABN, Publish Date - Dec 31 , 2025 | 04:17 AM
అమెరికా ఆంక్షలు, అస్థిర పరిస్థితులతో కరెన్సీ భారీగా పతనమవడం, ధరలు పెరిగిపోవడంతో ఇరాన్‌లో ఆందోళనలు వెల్లువెత్తాయి.
ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం
ఒక్క డాలర్‌కు 14.2 లక్షల రియాల్స్ పడిపోయిన కరెన్సీ
టెహ్రాన్, డిసెంబరు 30: అమెరికా ఆంక్షలు, అస్థిర పరిస్థితులతో కరెన్సీ భారీగా పతనమవడం, ధరలు పెరిగిపోవడంతో ఇరాన్‌లో ఆందోళనలు వెల్లువెత్తాయి. మంగళవారం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చాలా వరకు దుకాణాలు మూతపడ్డాయి. ఆందోళనకారులను నియంత్రించడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. కానీ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కేంద్ర బ్యాంకు చీఫ్ మహమ్మద్ రెజా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఒక డాలర్‌కు 13.8 లక్షల ఇరానీ రియాల్స్‌గా పడిపోయిన కరెన్సీ విలువ.. మంగళవారం 14.2 లక్షల రియాల్స్‌కు పతనమైంది. 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఇరాన్ కరెన్సీ విలువ ఒక డాలరుకు 32 వేల రియాల్స్. 2018లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకుని, ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. అప్పటి నుంచీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ పడిపోతూనే ఉన్నాయి. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ రకాల పన్నులు పెంచేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు అందాయి. ఇరాన్‌లో మతపెద్ద (సుప్రీం లీడర్) ఖమేనీ పాలనపై ప్రజల్లో కొన్నేళ్లుగా పెరిగిపోయిన వ్యతిరేకతకు ఈ అంశాలన్నీ తోడై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘మత గురువులు అధికారాన్ని వదిలి వెళ్లిపోవాలి, నియంతృత్వం అంతరించాలి’ అనే నినాదాలు వెల్లువెత్తాయి.
Updated Date - Dec 31 , 2025 | 04:17 AM