SU 57 Deal with Russia: ఆ డీల్ తర్వాతే.. ఈ డీల్!
ABN, Publish Date - Dec 01 , 2025 | 05:06 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్ 4-5 తేదీల్లో ఇండియా పర్యటనకు వస్తున్నారు! ఈ పర్యటనలో... రష్యా నుంచి స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఐదోతరం యుద్ధ విమానాలు....
అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాతే ఎస్‌యు-57 ఒప్పందం
రష్యా అధ్యక్షుడు పుతిన్ 4-5 తేదీల్లో ఇండియా పర్యటనకు వస్తున్నారు! ఈ పర్యటనలో... రష్యా నుంచి స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఐదోతరం యుద్ధ విమానాలు ‘ఎస్‌యు-57’లను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ విమానాల విక్రయానికి, 100 శాతం సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు రష్యా ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని భారత్‌లో తయారుచేయడానికే కాక.. వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా అనుమతిస్తామని మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెండు దేశాలూ కలిసి ఈ విమానాలను తయారుచేయడానికి.. రష్యా నుంచి వచ్చిన బృందం ఒకటి నాసిక్‌లో ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’కు చెందిన ఎస్‌యు-30ఎంకే విమానాల తయారీ కేంద్రాన్ని పరిశీలించింది.ఎస్‌యు-57ల తయారీకి అక్కడ ఉన్న సదుపాయాలు దాదాపు యాభై శాతం దాకా సరిపోతాయని, మిగతా ఏర్పాట్లు తాము చేస్తామని పేర్కొంది. అయినప్పటికీ.. ఈ డీల్ పుతిన్ పర్యటనలో కుదరకపోవచ్చని రక్షణ రంగ నిపుణులు కొందరు విశ్లేషిస్తున్నారు. భారత్-అమెరికా నడుమ చాలాకాలంగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం తుది దశలో ఉండడమే ఇందుకు కారణం.
అమెరికాతో సత్సంబంధాల కోసం..
సుఖోయ్-57 కాకుండా ఐదో తరం యుద్ధవిమానాలకు సంబంధించి భారత్ ముందున్న మరో ప్రత్యామ్నాయం అమెరికాకు ఎఫ్-35లు. వాటిని భారత్‌కు అమ్మడానికి అమెరికా ఇంతవరకూ అధికారికంగా ముందుకు రాలేదు. ట్రంప్ మాత్రం ఒకసారి.. ఎఫ్-35లను భారత్‌కు విక్రయించడానికి సిద్ధమని నోటిమాటగా అన్నారు. ఒకవేళ అమెరికా వాటిని అమ్మజూపినా.. రష్యాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలైన ఎస్-400లు ఉన్నచోట వాటిని నియోగించొద్దని ఆంక్షలు విధిస్తుంది. ఆ విమానాలకుసంబంధించిన 100 శాతం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు బదిలీ చేయదు. కాబట్టి వాటిని కొన్నా వాటి ఉపయోగం పరిమితమే అవుతుంది. కాబట్టి అవి వద్దనుకుంటే.. రష్యా నుంచి ఎస్‌యూ-57లను కొనడం ఒక్కటే ప్రత్యామ్నాయం అవుతుంది. కానీ, అమెరికాతో వాణిజ్య ఒప్పందం చర్చలు తుదిదశకు చేరుకున్న సమయంలో రష్యాతో ఎస్‌యు-57 డీల్ కుదుర్చుకుంటే అగ్రరాజ్యంతో వ్యవహారం చెడుతుందన్న ఆందోళన ఉంది. కాబట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరి.. ఆ దేశంతో సానుకూల సంబంధాలు ఏర్పడిన తర్వాత రష్యాతో ఎస్‌యు-57 డీల్ కుదుర్చుకోవచ్చన్నది భారత ప్రభుత్వ యోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికాతో చర్చలు సానుకూలంగా సాగేందుకు, ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకే.. ఎఫ్-35 యుద్ధవిమానాల కొనుగోలును పరిశీలిస్తున్నామంటూ భారత వాయుసేన వర్గాలు ప్రకటనలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతోపాటు.. రక్షణరంగానికి సంబంధించి అమెరికాతో ఇతరత్రా ఒప్పందాలపై భారత్ దృష్టి సారించింది. అందులో భాగంగానే.. భారత వాయుసేన అమెరికాకు చెందిన బోయింగ్ కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ను (గాలిలోనే యుద్ధవిమానాల్లో ఇంధనం నింపే ట్యాంకర్)ను లీజుకు తీసుకుంది. ఆ ‘మిడ్ ఎయిర్ రీఫ్యూయెలర్’ కొద్దిరోజుల క్రితమే భారత్‌కు వచ్చింది. అలాగే.. నౌకాదళం కోసం కొన్న 24 ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్లకు వచ్చే ఐదేళ్లపాటు అవసరమయ్యే సర్వీసింగ్ సపోర్ట్ అందించేందుకు రూ.7995 కోట్లతో ‘ఫాలో ఆన్ సపోర్ట్’ ఒప్పందాన్ని ఇటీవలే కుదుర్చుకుంది.
వచ్చే ఐదేళ్లపాటూ ఆ 24 సీహాక్ హెలికాప్టర్లకు అవసరమైన విడిభాగాలను సరఫరా చేయడం, వాటి నిర్వహణ, సాంకేతిక సహాయం, లాజిస్టిక్స్ ఈ ఒప్పందంలో భాగం. దీంతోపాటు.. 93 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.825 కోట్ల) విలువైన.. 100 ట్యాంకు విధ్వంసక జావెలిన్ క్షిపణులు, ఎక్స్‌కాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, సంబంధిత రక్షణ పరికరాలను అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. ఈ విక్రయానికి అమెరికా ప్రభుత్వం నవంబరు మూడోవారంలో ఆమోదం తెలిపింది. భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ 50 శాతానికి పెంచేసిన తర్వాత.. అమెరికాతో మనదేశం కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ పరికరాల ఒప్పందం ఇదే. అలాగే.. నేవల్ గస్తీ కోసం అత్యంత శక్తిమంతమైన రేడార్లు కలిగిన ఆరు ‘పీ-8ఐ’ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రా్‌ఫ్టల కొనుగోలుకు సంబంఽధించి 4 బిలియన్ డాలర్ల ఒప్పందంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన నేవీ వద్ద 12 ‘పీ-8ఐ’ విమానాలున్నాయి. మరో 10 విమానాల కోసం నేవీ అడిగినప్పటికీ.. ఆరు విమానాల కొనుగోలుకు ఆమోదం లభించింది. అమెరికాతో ఒప్పందం కుదిరి ఆ ఆరు విమానాలు అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్రంలో భారత నేవీ నిఘా పటిష్ఠమవుతుంది. యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యం పెరుగుతుంది. వీటన్నింటికంటే పెద్దది.. అమెరికా నుంచి బీ-1బీ లాన్సర్ అనే దీర్ఘ శ్రేణి సూపర్‌సానిక్ బాంబర్ కొనుగోలు లేదా లీజు ప్రతిపాదన పెట్టారు. వాస్తవానికి.. ఫైటర్ ఎయిర్‌క్రా్‌ఫ్టలతోపాటు బాంబర్స్‌ను కూడా రష్యా నుంచే తీసుకుందామని, రష్యా అభివృద్ధి చేసిన తుపెలోవ్-160 బాంబర్లను లీజుకు తీసుకుందామని భారత్ అనుకుంది. కానీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా బీ-1బీ బాంబర్ల కొనుగోలు/లీజు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే అది చాలా పెద్ద డీల్ అవుతుంది. ఇలా.. ఎస్‌యు-57 డీల్‌ను పక్కన పెట్టడం, ఇతరత్రా పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ భావిస్తోంది.
- సెంట్రల్ డెస్క్
రష్యాతోనూ..
ఎస్‌యు-57 డీల్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ.. పుతిన్ పర్యటనలో కొన్ని మేజర్ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యమైనది.. ఎస్-400 డీల్. ఇప్పటికే మన గగనతల రక్షణ వ్యూహంలో ఎస్-400లు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాటికి అదనంగా మరో ఐదు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ల కొనుగోలుకు ఈ పర్యటనలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో.. ఎస్-400 వ్యవస్థల ద్వారా వాడిన క్షిపణుల స్థానంలో కొత్త మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి భారత్ ప్రణాళికలు రచించింది. వీటితోపాటు.. ధ్వనివేగానికి ఆరు రెట్ల వేగంతో దూసుకెళ్లి 300 కిలోమీటర్ల అవతల ఉన్న లక్ష్యాలను సైతం తుత్తునియలు చేయగల అలా్ట్ర లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ‘ఆర్-37ఎం యాక్స్ హెడ్’ల కొనుగోలుకు సంబంధించి కూడా రష్యాతో భారత్ కొన్నాళ్లుగా చర్చలు జరుపుతోంది. అవి కూడా పుతిన్ పర్యటనలో తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఇలా ఒకవైపు అమెరికాతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తూనే.. రష్యాతోనూ దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న సంబంధాలను కాపాడుకునే దిశగా భారత్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
Updated Date - Dec 01 , 2025 | 05:06 AM