India China to Resolve Border Issues: వీలైనంత త్వరగా సరిహద్దుల పరిష్కారం
ABN, Publish Date - Aug 21 , 2025 | 03:27 AM
సరిహద్దు పునర్విభజన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, ఈ మేరకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని..
2005 నాటి ఒప్పందం వెలుగులో కసరత్తు.. నిపుణుల బృందం ఏర్పాటు
వాణిజ్యం, విమాన సేవలు పునఃప్రారంభం
కైలాస పర్వతం, మానస సరోవరం సందర్శనకు వీలుగా మరిన్ని చర్యలు
భారత్-చైనా సంయుక్త నిర్ణయాలు
న్యూఢిల్లీ, బీజింగ్, ఆగస్టు 20: సరిహద్దు పునర్విభజన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, ఈ మేరకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని భారత్-చైనా సంయుక్తంగా నిర్ణయించాయి. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌యీతో ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం సమావేశమైన అనంతరం విదేశాంగశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. భారత్-చైనా సరిహద్దు అంశంపై 2005లో కుదిరిన ఒప్పందం మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల పునర్విభజనను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు ఈ ప్రకటన తెలిపింది. దీని ప్రకారం.. ఇరుదేశాల మధ్య లిపులేఖ్ పాస్, షిప్కీ లా, నాథూ లా కేంద్రాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించనున్నారు. మరోవైపు, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సేవలను కూడా తిరిగి ప్రారంభించాలని, వీసాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని మరింత మంది భారతీయ భక్తులు, యాత్రికులు సందర్శించుకునేలా వీలు కల్పించాలని తీర్మానించారు. ప్రస్తుతం పశ్చిమ సెక్టార్‌లో ఉన్నట్టుగా తూర్పు, మధ్య సెక్టార్లలోనూ జనరల్ స్థాయి యంత్రాంగాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటానికి రానున్న భారత ప్రధాని మోదీకి చైనా స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రకటన పేర్కొంది. అలాగే, ఎస్‌సీఓ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న చైనాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా భారత్ తెలిపింది. కాగా, భారత్‌లో ముగిసిన వాంగ్‌యీ పర్యటనపై చైనా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ సుంకాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ సవాళ్లను, ఏకపక్ష దుందుడుకు పోకడలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు పేర్కొంది.
Updated Date - Aug 21 , 2025 | 03:27 AM