India US Trade Deal: సుంకాలు 16శాతం లోపే
ABN, Publish Date - Oct 23 , 2025 | 06:05 AM
భారత్‌కు అమెరికా అడ్డగోలు సుంకాల బాధ తప్పనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో ఈ సమస్యకు పరిష్కారం రానుంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు
జన్యుమార్పిడి చేయని మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకారం!
ఈ నెలాఖరులోనే ప్రకటన వెలువడే అవకాశం
కేంద్ర అధికారవర్గాలను ఉటంకిస్తూ ‘మింట్’ కథనం
అమెరికా శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు
ప్రధాని మోదీకి ఫోన్.. భారతీయులకు శుభాకాంక్షలు
రష్యా చమురు కొనుగోళ్లు భారత్ తగ్గిస్తుందని వ్యాఖ్య
ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు.. ఇరు ప్రజాస్వామ్య దేశాలు
ప్రపంచానికి ఆశల వెలుగులు అందించాలని ఆకాంక్ష
వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో దీపాలు వెలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్/ న్యూఢిల్లీ, అక్టోబరు 22: భారత్‌కు అమెరికా అడ్డగోలు సుంకాల బాధ తప్పనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో ఈ సమస్యకు పరిష్కారం రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలతో సంబంధమున్న ముగ్గురు అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థ ‘మింట్’ ఈ మేరకు కథనం ప్రచురించింది. దానికితోడు భారత్, అమెరికాలలో తాజా పరిణామాలు కూడా సుంకాల బాధ తొలగిపోయి, ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడతాయనే సంకేతాలు ఇస్తుండటం గమనార్హం. మొత్తానికి భారత్‌పై సుంకాలు 15శాతం16శాతం కు దిగివస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై
ఈ నెల 26-27 తేదీల్లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి.
ఇరువర్గాలు దిగొస్తుండటంతో
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా.. వ్యవసాయ, పాడి రంగాలకు సంబంధించిన అంశాలపై పీటముడి పడింది. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని కూడా అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ కారణంతో చూపుతూనే భారత్‌పై ఏకంగా 50శాతం సుంకాలను విధించింది. అయితే ఇరువర్గాల కొంతమేర దిగి వచ్చాయని, దీనితోవాణిజ్య ఒప్పందంపై తుది చర్చలు కొలిక్కి వచ్చినట్టేనని తెలిసింది. చవకగా వచ్చే అమెరికా మొక్కజొన్న, పాల ఉత్పత్తులను అనుమతిస్తే తమ రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇటీవలి వరకు భారత్ వాదిస్తూ వచ్చింది. దానికితోడు అమెరికా జన్యుమార్పిడి ఉత్పత్తులు, మాంసాహార పదార్థాలు వేసే ఆవులు/గేదెల నుంచి తీసిన పాల ఉత్పత్తులను సెంటిమెంట్, పర్యావరణపరంగా అనుమతించలేమని స్పష్టం చేసింది. అయితే చర్చల సందర్భంగా అమెరికా నుంచి జన్యుమార్పిడి చేయని సాధారణ మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను పెంచుకునేందుకు.. రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించి, అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకరించినట్టు సమాచారం. దీనికి అమెరికా కూడా అంగీకరించడంతో ప్రతిష్ఠంభనకు తెరపడిందని చర్చలతో సంబంధం ఉన్న అధికార వర్గాలు వెల్లడించాయి. మోదీతో ట్రంప్ ఫోన్ చర్చలు, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొనడం కూడా.. వాణిజ్య ఒప్పందం దిశగా సంకేతాలేనని పేర్కొన్నాయి. మొత్తంగా భారత్‌పై అమెరికా సుంకాలు 15శాతం-16శాతంమేరకు దిగిరానున్నాయన్నారు.
శ్వేత సౌధంలో దీపావళి వేడుకలు
హిందువులు ఘనంగా జరుపుకొనే దీపావళి పండుగ సందర్భంగా అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధంలో వేడుకలు నిర్వహించారు. అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులతో కలసి అధ్యక్షుడు దీపాలను వెలిగించారు. భారతీయులకు, భారతీయ అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీకి ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపానని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. మోదీ గొప్ప వ్యక్తి అని, తన స్నేహితుడని పేర్కొన్నారు. వాణిజ్యం, భారత్-పాక్ సంబంధాలు సహా తాము చాలా విషయాలు మాట్లాడుకున్నామని చెప్పారు. పాకిస్థాన్‌తో యుద్ధం వద్దని చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు. ఇంతకుముందే ప్రధాని మోదీతో మాట్లాడాను. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్నాయి. నా లాగే మోదీ కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారు. అందుకే రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయబోవడం లేదు. ఇప్పటికే కొనుగోళ్లు తగ్గిస్తూ వస్తోంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికాలోని భారతీయ అమెరికన్లు నేతృత్వం వహిస్తున్న సంస్థలు ప్రపంచంలోనే పెద్దవని, వారు అమెరికా ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఆశల వెలుగులు అందించాలి: మోదీ
కాగా, తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘మోదీకి ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని, రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశ అనే వెలుగును ఇవ్వాలని మోదీ ఆకాంక్షించారు. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటానికి, అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు’’ అని వెల్లడించింది.
Updated Date - Oct 23 , 2025 | 06:17 AM