Hundreds of Indians Escape: మయన్మార్ సైబర్‌క్రైమ్ స్థావరం నుంచి వందలమంది భారతీయులు పరార్
ABN, Publish Date - Oct 27 , 2025 | 01:35 AM
మయన్మార్‌లోని సైబర్‌క్రైమ్ అడ్డాల నుంచి థాయిలాండ్‌కు పారిపోయిన వెయ్యిమందిలో వందలాదిమంది భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా...
న్యూఢిల్లీ/బ్యాంకాక్, అక్టోబరు 26: మయన్మార్‌లోని సైబర్‌క్రైమ్ అడ్డాల నుంచి థాయిలాండ్‌కు పారిపోయిన వెయ్యిమందిలో వందలాదిమంది భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో సైబర్ ముఠాలకు అడ్డాగా మారిన కేకే పార్క్‌లో సైన్యంతో సోదాలు చేయించనున్నట్టు గత సోమవారం మయన్మార్‌లోని జుంటా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బుధ-శుక్రవారాల మధ్య మయన్మార్ నుంచి సరిహద్దు గుండా థాయిలాండ్‌లోకి వెయ్యిమందికిపైగా పారిపోయారు. వీరంతా థాయిలాండ్‌లోని కరేన్ రాష్ట్రం మాయిసోట్ జిల్లాలోకి ప్రవేశించారు. వారిలో 399 మంది భారతీయులు, 147 మంది చైనీయులు, 31 మంది థాయిలాండ్ జాతీయులు కూడా ఉన్నట్టు థాయిలాండ్‌కు చెందిన ఖావ్‌సోద్ దినపత్రిక ప్రచురించింది. దీన్ని థాయిలాండ్ అధికారులు కూడా నిర్ధారించారు. మయన్మార్‌లో కేకే పార్క్ వంటి విశాలమైన కాంపౌండ్‌ల అడ్డాగా సైబర్ ముఠాలు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ కాంపౌండ్‌లలో వేలాది మంది పనిచేస్తున్నారు. వీరిలో కొందరిని ఉద్యోగం పేరిట రప్పించి సాయుధ సిబ్బంది పర్యవేక్షణలో నిర్బంధంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్నవారిలో వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, పాకిస్థాన్, ఇండోనేసియా, నేపాల్ జాతీయులు కూడా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనూ మయన్మార్-థాయిలాండ్ సరిహద్దు వెంబడి సైబర్ అడ్డాలపై దాడులు చేసి కాపాడిన 549 మంది పౌరులను భారత్ రెండు మిలిటరీ విమానాల్లో తీసుకువచ్చింది.
Updated Date - Oct 27 , 2025 | 01:35 AM