H-1B Visa Crisis: కెరీర్లు.. కుటుంబాలపై పిడుగు!
ABN, Publish Date - Dec 22 , 2025 | 04:36 AM
అమెరికా వీసా సంక్షోభం నానాటికీ ముదురుతోంది. ముందస్తుగా షెడ్యూల్ చేసిన హెచ్-1బీ ఇంటర్వ్యూలను అగ్రరాజ్యం అకస్మాత్తుగా వాయిదా వేయడంతో వేలాది...
ముదిరిన హెచ్-1బీ వీసా సంక్షోభం
వేల మంది భారతీయులపై ప్రభావం
ఇంటర్వ్యూ తేదీల వాయిదాతో తిప్పలు
న్యూఢిల్లీ, డిసెంబరు 21: అమెరికా వీసా సంక్షోభం నానాటికీ ముదురుతోంది. ముందస్తుగా షెడ్యూల్ చేసిన హెచ్-1బీ ఇంటర్వ్యూలను అగ్రరాజ్యం అకస్మాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరకు, మరికొన్నింటిని ఏకంగా 2027 సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్లు దరఖాస్తుదారులకు సమాచారం అందడంతో వారంతా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్లను బుక్ చేసుకొని అమెరికా నుంచి భారత్‌కు వచ్చినవారు ఇక్కడే చిక్కుకుపోయారు. తమ కుటుంబాలను అమెరికాలో వదిలి వచ్చిన వీరంతా ఇప్పుడు ప్రయాణాలు రద్దు కావడంతో పాటు ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే వీసా అపాయింట్‌మెంట్లు తీసుకున్నవారు గతంలో కేటాయించిన తేదీల్లో కాన్సులేట్లకు రావొద్దని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. ‘‘వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈ-మెయిల్ వస్తే.. తదుపరి తేదీపై సహాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొంది. పాత తేదీల ప్రకారం ఇంటర్వ్యూలకు వచ్చినవారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న జాప్యం చాలామంది కెరీర్లను దెబ్బతీస్తోందని, ఇది ఎన్నో కుటుంబాలను విడదీసిందని ఇమిగ్రేషన్ న్యాయవాదులు పేర్కొంటున్నారు. మరోవైపు,రాయబార కార్యాలయాల్లో వీసా స్టాంపిం గ్ అపాయింట్‌మెంట్ కోసం 12నెలల వరకూ జాప్యం చోటుచేసుకుంటున్నందున అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలని హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, జే వీసాలపై ఉన్న సిబ్బందికి గూగుల్, యాపిల్ కంపెనీలు సూచించాయి.
Updated Date - Dec 22 , 2025 | 04:36 AM