Gun Culture Widespread : సిడ్నీ శివార్లలో తుపాకీ రాజ్యం!
ABN, Publish Date - Dec 18 , 2025 | 02:23 AM
అక్కడ ఎక్కడ చూసినా తుపాకులే! ఒక్కొక్కరి వద్ద వందల కొద్దీ గన్స్.. కావాలనుకున్నప్పుడు పెద్దదో, చిన్నదో ఓ తుపాకీ తీసుకుని బయల్దేరడమే!
ప్రతి 33 మందిలో ఒకరికి లైసెన్స్..మొత్తం 11.3లక్షల తుపాకులు
సిడ్నీ, డిసెంబరు 17: అక్కడ ఎక్కడ చూసినా తుపాకులే! ఒక్కొక్కరి వద్ద వందల కొద్దీ గన్స్.. కావాలనుకున్నప్పుడు పెద్దదో, చిన్నదో ఓ తుపాకీ తీసుకుని బయల్దేరడమే!! ఆస్ట్రేలియాలో యూదులపై ఉగ్రదాడి జరిగిన సిడ్నీ బోండి బీచ్ ఉన్న న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం వ్యవహారమిది. బోండి బీచ్ దాడిలో 15 మంది మరణించిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ఆయుధాల రిజిస్ట్రీ గణాంకాలతో ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక’ తాజాగా కథనం ప్రచురించింది. ముఖ్యంగా బోండి బీచ్ సహా సిడ్నీ శివారు ప్రాంతాల్లో గన్ కల్చర్ ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఆయుధాల రిజిస్ట్రీ వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా మొత్తంలో ఎక్కువ సంఖ్యలో వ్యక్తిగత తుపాకులున్న టాప్ 10 మందిలో ఆరుగురు సిడ్నీ శివారు ప్రాంతాల్లోనే ఉన్నారు. అందులో ఒకరి వద్ద ఏకంగా 295 ఆయుధాలు ఉన్నాయి. మిగతా ఐదుగురి వద్దా 200కుపైనే గన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో తుపాకీ లైసెన్సు సులువుగానే లభిస్తుంది. లైసెన్సు ఉన్నవారు ఎన్ని గన్స్ అయినా కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది. సగటున చూస్తే సిడ్నీ నగరంలో లైసెన్సు ఉన్న ఒక్కొక్కరి వద్ద సగటున 3కుపైగా గన్స్ ఉంటే.. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఈ సగటు 5కుపైనే కావడం గమనార్హం. ఈ రాష్ట్రంలో సగటున ప్రతి 33 మంది జనాభాలో ఒకరికి తుపాకీ లైసెన్సు ఉంది. వారివద్ద మొత్తంగా 11,33,690 గన్స్ ఉన్నాయి. ఇక ది ఆస్ట్రేలియన్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ కమిషన్ అంచనాల ప్రకారం.. మరో 2లక్షలకుపైనే అక్రమ ఆయుధాలు ఉన్నాయి.
Updated Date - Dec 18 , 2025 | 02:23 AM