U.S Politics: రాజీ దిశగా ట్రంప్-మస్క్
ABN, Publish Date - Jun 08 , 2025 | 06:16 AM
లైంగిక వేధింపుల కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని ఇంతకుముందు ఆరోపించిన టెస్లా సీఈవో... తాజాగా ఆ పోస్టును తొలగించారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు’ పోస్టును తొలగించిన మస్క్
వాషింగ్టన్, జూన్ 7: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య రాజీ దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. లైంగిక వేధింపుల కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని ఇంతకుముందు ఆరోపించిన టెస్లా సీఈవో... తాజాగా ఆ పోస్టును తొలగించారు. మరోవైపు, ట్రంప్‌తో శాంతి కుదుర్చుకోవాలని మస్క్‌ను అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్‌మన్ కోరారు. వారిద్దరికీ తన మద్దతు ఉంటుందని, విడిపోవడం కంటే కలిసుంటేనే మనం బలంగా ఉంటామని ట్వీట్ చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ.. మీరు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని బదులిచ్చారు. కాగా, మస్క్‌పై అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేయకుండా వైట్‌హౌస్ వర్గాలు కృషి చేస్తున్నాయని మీడియా సంస్థ ‘పొలిటికో’ కథనం పేర్కొంది. ట్రంప్, మస్క్ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడానికి రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ముందుకొచ్చారు. అయితే దీనికి కొద్దిగా ఖర్చు అవుతుందన్నారు. ‘డి (డొనాల్డ్ ట్రంప్), ఈ (ఎలాన్ మస్క్) మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఫీజుగా స్టార్‌లింక్ షేర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీరిద్దరూ ఘర్షణ పడకండి’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మస్క్ ఓటింగ్ నిర్వహించారు. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించే విధంగా కొత్త పార్టీ స్థాపనకు సమయం అసన్నమైందా అని ఆయన ప్రశ్నించారు. ఈ పోల్‌లో 80శాతం మంది తన నిర్ణయానికి మద్దతు ప్రకటించారని మస్క్ పేర్కొన్నారు. అనంతరం ‘ది అమెరికా పార్టీ’’ అంటూ మరో పోస్టును ఆయన షేర్ చేశారు. దీంతో మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 08 , 2025 | 08:38 AM