ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rare Foot Surgery: పాదమిచ్చిన చెవి!

ABN, Publish Date - Dec 29 , 2025 | 12:56 AM

చైనాలోని జినాన్‌కు చెందిన ఓ మహిళ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆమె జుత్తు ఓ యంత్రంలో చిక్కుకుంది.. అది బలంగా లాగేసే సరికి ఆమె తల ఎడమవైపు పైనుంచి మెడదాకా చర్మమంతా ఊడి వచ్చేసింది..

బీజింగ్‌, డిసెంబరు 28: చైనాలోని జినాన్‌కు చెందిన ఓ మహిళ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ఆమె జుత్తు ఓ యంత్రంలో చిక్కుకుంది.. అది బలంగా లాగేసే సరికి ఆమె తల ఎడమవైపు పైనుంచి మెడదాకా చర్మమంతా ఊడి వచ్చేసింది. చెవి తెగిపడింది. వెంటనే షాన్‌డోంగ్‌ ప్రొవిన్షియల్‌ ఆస్పత్రికి తరలించారు. చెవిని తిరిగి అమర్చేందుకు వైద్యులు ప్రయత్నించినా, ఆ భాగంలో చర్మమంతా ఊడి వచ్చేయడంతో వీలుకాలేదు. అలాగే బయటే ఉంచితే చెవిభాగం జీవం కోల్పోతుంది. వెంటనే వైద్యులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. పాదం పైభాగంలో ఊడిపడిన చెవిని అమర్చారు. అదీ అంతసులువుగా ఏమీ జరగలేదు. పాదంపై భాగంలో చర్మానికి కోతపెట్టి.. అక్కడి రక్తనాళాలకు, ఊడిపడ్డ చెవిలోని రక్తనాళాలను అనుసంధానం చేశారు. సూక్ష్మంగా మిల్లీమీటరులో ఐదో వంతు అంత సన్నగా ఉండే రక్తనాళాలను అనుసంధానం చేయడం కోసం చాలా కష్టపడ్డారు. మొత్తంగా పాదంపై చెవిభాగాన్ని అమర్చేందుకు వైద్యుల బృందానికి 10 గంటలు పట్టింది. మొత్తానికి చెవిభాగానికి జీవం దొరికింది. తర్వాత ఆమె పొట్టభాగం నుంచి చర్మాన్ని తీసి.. తల ఎడమవైపు ఊడిపోయిన చర్మం స్థానంలో అమర్చారు (స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అంటారు). సుమారు ఆరు నెలల తర్వాత ఆ చర్మం సాధారణ స్థితికి చేరింది. దీనితో పాదంపై ఉన్న చెవి భాగాన్ని తీసి.. తల ఎడమవైపున దాని స్థానంలో తిరిగి విజయవంతంగా అమర్చారు. పాదాల పైభాగంలో మన పుర్రెపై ఉన్నట్టుగానే తక్కువ మందంతో, దాదాపు సమాన పరిమాణంలోని రక్తనాళాలతో కూడిన చర్మం ఉంటుందని.. అందుకే చెవిని అక్కడ అమర్చామని ఆస్పత్రి మైక్రోసర్జరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ షెన్‌కియాంగ్‌ తెలిపారు.

ఇంతకుముందూ ఇలాంటి అరుదైన చికిత్సలు..

చైనాలో వైద్యులు ఇలా చిత్రమైన, అరుదైన శస్త్రచికిత్సలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. 2013లో 17 ఏళ్ల అమ్మాయికి ముఖంపై చర్మం కాలిపోతే.. ఆమె పొట్టభాగంలో కొంత చర్మాన్ని తీసి, అక్కడే పెంచి, తర్వాత ముఖంపై కాలిపోయిన భాగాల్లో అమర్చారు. 2017లో రోడ్డు ప్రమాదంలో చెవిని కోల్పోయిన వ్యక్తి భుజంపై కృత్రిమంగా చెవిని పెంచారు. బాగా దెబ్బతిన్న చెవి భాగంలో గాయం తగ్గి, సర్దుకున్నాక కృత్రిమ చెవిని అక్కడ అమర్చారు.

Updated Date - Dec 29 , 2025 | 12:56 AM