ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Starlink Satellites: స్టార్‌లింక్‌ ఉపగ్రహాలకు రష్యా గండం?

ABN, Publish Date - Dec 23 , 2025 | 03:45 AM

బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్‌నెట్‌ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో.....

  • వాటిని లక్ష్యంగా చేసుకొని కొత్త ఆయుధాల తయారీ

  • ఉపగ్రహాలు ఉన్న కక్ష్యలోకి మిల్లీమీటర్‌ సైజు పెల్లెట్లను ప్రయోగించడం ద్వారా ధ్వంసం చేసే ప్రణాళిక?

  • నాటో నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం

  • 17న ఓ శాటిలైట్‌తో సంబంధాలు తెగాయన్న స్టార్‌లింక్‌

  • నియంత్రణ కోల్పోయి భూమి వైపు వస్తున్న ఉపగ్రహం

  • దీని వెనుక రష్యానే ఉన్నట్లు అనుమానాలు

  • ఉపగ్రహాలపై పెల్లెట్ల దాడితో రష్యా, చైనా శాటిలైట్లకూ ప్రమాదమేనంటున్న నిపుణులు

వాషింగ్టన్‌, డిసెంబరు 22: బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్‌నెట్‌ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఒకదాంతో (శాటిలైట్‌ 35956) డిసెంబరు 17 నుంచి సంబంధాలు తెగిపోయాయంటూ 18న ఈలన్‌ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్‌’ సంస్థ ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టింది! కక్ష్యలో 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు అనూహ్య సాంకేతిక లోపం కారణంగా ఆ శాటిలైట్‌ ప్రొపల్షన్‌ ట్యాంకు నుంచి వాయువు విడుదలయ్యిందని.. దాంతో ఉపగ్రహం తన స్థిరత్వాన్ని కోల్పోయి, కక్ష్య నుంచి అకస్మాత్తుగా కిందికి జారిందని వెల్లడించింది. ఆ సమయంలో శాటిలైట్‌ నుంచి కొన్ని చిన్నచిన్న శకలాలు బయటకు వచ్చాయని.. తక్కువ వేగంతో కదిలే ఆవస్తువులను ట్రాక్‌ చేయొచ్చని వివరించింది. నియంత్రణ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కిందికి జారుతున్న ఆ శాటిలైట్‌ త్వరలో భూవాతావరణంలోకి దూసుకురానుంది. (అలా వచ్చినప్పుడు.. అవి కింద పడకుండా, భూవాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోయేలా రూపొందించారు). కట్‌ చేస్తే.. స్టార్‌లింక్‌ శాటిలైట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా ఒక కొత్త ఉపగ్రహ నిరోధక ఆయుధాన్ని తయారుచేస్తోందంటూ నాటో దేశాలకు చెందిన నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’ వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. నాలుగేళ్లుగా యుద్ధంతో కుదేలవుతున్న ఉక్రెయిన్‌ ఇంకా ఇంటర్‌నెట్‌ను, ఇతర కమ్యూనికేషన్‌ వ్యవస్థలను ఉపయోగించగలుగుతోందంటే దానికి కారణం.. స్టార్‌లింక్‌ శాటిలైట్లేనని భావిస్తున్నందునే రష్యా ఆ ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి ‘జోన్‌-ఎఫెక్ట్‌’ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అందులో పేర్కొంది. డిసెంబరు 17న స్టార్‌లింక్‌ శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోవడం.. నాలుగైదు రోజుల వ్యవధిలోనే అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్త కథనం రావడంతో.. ఆ శాటిలైట్‌ కక్ష్య నుంచి జారిపోవడం వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎలా పనిచేస్తుందంటే..

స్టార్‌లింక్‌ శాటిలైట్లు పరిభ్రమించే కక్ష్యలోకి.. ఉపగ్రహం/రాకెట్‌ ద్వారా అత్యధిక సాంద్రత కలిగిన వందలు, వేల పెల్లెట్లను జారవిడవడం ద్వారా దాన్ని ‘కిల్‌ జోన్‌’గా మారుస్తారు. మిల్లీమీటర్‌ పరిమాణంలో ఉండే ఈ పెల్లెట్లతో ఒకేసారి వేలాది ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చు (అందుకే దీన్ని ‘జోన్‌ ఎఫెక్ట్‌’గా వ్యవహరిస్తున్నారు). స్టార్‌లింక్‌ శాటిలైట్లు కక్ష్యలో గంటకు 27 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో తిరిగే శాటిలైట్లను.. ఆ కక్ష్యలో రష్యా వదిలిన వేలాది చిన్న పెల్లెట్‌ తాకినా ఆ తాకిడికి ఉపగ్రహం ధ్వంసమవుతుంది. అప్పుడు దాని శకలాలు కూడా అదే కక్ష్యలో తిరుగుతూ మిగతా ఉపగ్రహాల ఉనికికి ప్రమాదకరంగా మారుతాయి. వేల సంఖ్యలో పెల్లెట్లను వదలడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకునే వీలుంటుంది. అత్యంత చిన్నగా ఉండే ఆ పెల్లెట్లను గుర్తించడం, వాటిని రష్యానే అక్కడ జారవిడిచిందని నిరూపించడమూ కష్టమేనని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. నాటో దేశాలకు చెందిన నిఘావర్గాల నివేదిక రాకముందు.. సాంకేతిక లోపం కారణంగా తమ ఉపగ్రహాల్లో ఒకదాంతో సంబంధాలు తెగిపోయినట్టు ప్రకటించిన స్టార్‌ లింక్‌ సంస్థ.. ఆ నివేదిక వచ్చాక మాత్రం దానిపై ఇంకా స్పందించలేదు.

రష్యా అలా చేయకపోవచ్చు..

రోదసిలో ఆయుధాల మోహరింపును నిలిపివేయడానికి కృషి చేయాలంటూ ఐక్యరాజ్యసమితికి రష్యా గతంలో పిలుపునిచ్చిందని.. అలా రోదసిలో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశమేదీ మాస్కోకి లేదంటూ గతంలోనే పుతిన్‌ స్పష్టం చేశారని అంతరిక్ష భద్రత నిపుణులు కొందరు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ రష్యా స్టార్‌లింక్‌ను లక్ష్యంగా చేసుకున్న మాట నిజమే అనుకున్నా.. జోన్‌-ఎఫెక్ట్‌ ఆయుధంతో ఒక్క స్టార్‌లింక్‌, పశ్చిమ దేశాల శాటిలైట్లకే కాక రష్యన్‌ ఉపగ్రహాలకూ, దాని మిత్రపక్షమైన చైనా శాటిలైట్లకూ ముప్పేనని వారు గుర్తుచేస్తున్నారు. ఒక్క శాటిలైట్‌ ధ్వంసమైనా దాన్నుంచి వెలువడే శకలాలు ఆ కక్ష్య మొత్తాన్నీ ప్రమాదకరమైన కిల్‌జోన్‌గా మార్చేసి, మిగతా ఉపగ్రహాలను ధ్వంసం చేసి.. ఆ కక్ష్యను నిరుపయోగంగా మార్చేస్తాయని.. కాబట్టి రష్యా అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. స్టార్‌లింక్‌ ఉపగ్రహాలు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి. పెల్లెట్ల కారణంగా అవి పెద్ద సంఖ్యలో నియంత్రణ కోల్పోయి కిందకి జారడం మొదలుపెడితే... 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్‌), చైనాకు చెందిన టియాంగోంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ వంటివాటి ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది.

Updated Date - Dec 23 , 2025 | 05:58 AM