China Tiangong space station: చైనా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యోమగాములు
ABN, Publish Date - Nov 26 , 2025 | 04:04 AM
చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యోమగాములు చిక్కుబడిపోయారు. వీరిని అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి....
బీజింగ్, నవంబరు 25: చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ముగ్గురు వ్యోమగాములు చిక్కుబడిపోయారు. వీరిని అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి ఎమర్జెన్సీ అంతరిక్ష నౌకను చైనా మంగళవారం పంపింది. షెన్‌జో అంతరిక్ష నౌక ద్వారా ఈనెల మొదట్లో చైనా అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాముల బృందం భూమికి రావాల్సి ఉంది. అయితే వారు వెళ్లిన షెన్‌జో 20 నౌక అద్దానికి అంతరిక్షంలో మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు తగిలాయి. దాని వల్ల ఆ అద్దం పాడై తిరుగు ప్రయాణానికి వీలులేకుండా పోయింది. తర్వాత తమ స్థానాన్ని భర్తీ చేయడానికి షెన్‌జో 21 అంతరిక్ష నౌకలో వచ్చిన ముగ్గురు వ్యోమగాముల బృందాన్ని అంతరిక్ష కేంద్రంలోనే వదిలి షెన్‌జో 20 మిషన్ బృందం భూమికి చేరింది. పాడైపోయిన తమ నౌకను అంతరిక్షంలోనే వదిలివేసి షెన్‌జో 21 నౌకలో వారు తిరిగి వచ్చారు. అయితే అక్కడ చిక్కుకుపోయిన షెన్‌జో 21 బృందాన్ని తిరిగి భూమికి తీసుకురావడం కోసం షెన్‌జో 22 అంతరిక్ష నౌకను ఖాళీగా చైనా పంపింది.
Updated Date - Nov 26 , 2025 | 04:04 AM