China Massive Loan Network: డ్రాగన్ రుణ వలయంలో ప్రపంచం
ABN, Publish Date - Nov 28 , 2025 | 04:08 AM
ప్రపంచం డ్రాగన్ రుణ వలయంలో చిక్కింది. అగ్రరాజ్యాలు సహా ప్రపంచంలోని 80శాతం దేశాల్లోని కంపెనీలకు చైనా బ్యాంకులు భారీ స్థాయిలో అప్పులు ఇచ్చాయి. ఈ రుణాలను అడ్డుపెట్టుకునే ఆ కంపెనీలను...
అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా సహా పెద్ద దేశాల కంపెనీలకూ భారీగా రుణాలు
179 దేశాలకు అప్పులిచ్చిన చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థలు
ఆ దేశాల్లోని కీలక రంగాల కంపెనీల్లో వాటాలు, పెత్తనం పెంచుకునే వ్యూహాలు
న్యూఢిల్లీ, నవంబరు 27: ప్రపంచం ‘డ్రాగన్’ రుణ వలయంలో చిక్కింది. అగ్రరాజ్యాలు సహా ప్రపంచంలోని 80శాతం దేశాల్లోని కంపెనీలకు చైనా బ్యాంకులు భారీ స్థాయిలో అప్పులు ఇచ్చాయి. ఈ రుణాలను అడ్డుపెట్టుకునే ఆ కంపెనీలను, తద్వారా దేశాలను చైనా ప్రభావితం చేస్తోంది. చైనా నుంచి రుణాలు తీసుకున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉంది. రష్యా, ఆస్ట్రేలియా, వెనెజువెలా, పాకిస్థాన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా వర్జీనియాలోని విలియం అండ్ మేరీ కాలేజీకి చెందిన పరిశోధక విభాగం ‘ఎయిడ్ డేటా’ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. సుమారు మూడేళ్లపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్థిక సంస్థలు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి.. 2000వ సంవత్సరం నుంచి 2023 మధ్య డేటాతో ఈ నివేదికను రూపొందించింది. అందులోని వివరాల ప్రకారం..
పెద్ద దేశాలకే ఇస్తూ.. ప్రభావితం చేస్తూ..
చైనా మొదట్లో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా రుణాలు ఇచ్చేది. ఆయా దేశాలు, అక్కడి వనరులపై పెత్తనం చలాయించేది. కానీ 2000 సంవత్సరం నుంచి వ్యూహం మార్చి క్రమంగా సంపన్న దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచుతూ వచ్చింది. మొదట్లో పేద, మధ్యాదాయ దేశాలకే 90శాతం రుణాలు ఇవ్వగా.. ఇప్పుడు 75శాతానికి పైగా రుణాలు పెద్ద దేశాలకే ఇవ్వడం గమనార్హం. దీంతో ఆయా దేశాల్లోని సంస్థలను, వాటి ద్వారా ఆ దేశాలను తనకు అనుకూలంగా వ్యవహరించేలా లేదా తనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేని విధంగా చైనా ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చైనా ఇప్పటివరకు అమెరికాలోని 2,500 సంస్థలు, ప్రాజెక్టులకు రూ.18.1 లక్షల కోట్ల (202బిలియన్ డాలర్లు) రుణా లు ఇచ్చింది. 27దేశాల యూరోపియన్ యూనియన్ కూటమికి చెందిన 1,800 కంపెనీలు, ప్రాజెక్టులకు రూ.14.4లక్షల కోట్లు (161 బిలియన్ డాలర్లు) అప్పులు ఇచ్చింది. ఈ రుణాల్లో 95శాతానికిపైగా చైనా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చినవే. చైనా నుంచి సంపన్న దేశాలకు వెళ్తున్న రుణాల్లో చాలా వరకు కీలక మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ తయారీవంటి టెక్ కంపెనీలు, అరుదైన ఖనిజాలకు సంబంధించిన కంపెనీలు, ప్రాజెక్టులకే అందుతుండటం గమనార్హం. ఇందుకోసం షెల్ కంపెనీలు, అంతర్జాతీయ బ్యాంక్ సిండికేట్లను చైనా వినియోగించుకుంటోందని నివేదిక పేర్కొంది. మొ త్తంగా ఆయా కంపెనీల్లో వాటాలు పెంచుకోవడం, వీలైతే చేజిక్కించుకోవడం ద్వారా సంపన్న దేశాల్లోని కీలక రంగాలపై చైనాపట్టు సాధిస్తోందని తెలిపింది.
ప్రపంచంలో గుర్తింపు ఉన్న మొత్తం 217 దేశాలకుగాను 179 దేశాలకు చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థలు 196 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి.
2023లో ప్రపంచంలో అత్యంత ఎక్కువగా రుణాలు ఇచ్చిన, తిరిగి వసూలు చేసుకున్న దేశం చైనాయే. ఆ ఏడాది చైనా వివిధ దేశాలకు కలిపి మొత్తం రూ.12.5 లక్షల కోట్లు (140 బిలియన్ డాలర్లు) రుణాలు ఇచ్చింది.
నాటో, జీ7 వంటి కూటములు కూడా వివిధ దేశాలకు భారీగా రుణాలు ఇస్తున్నాయి. పశ్చిమ దేశాల్లోని చాలా ఆర్థిక సంస్థలు కొంతకాలం నుంచి చైనా ప్రభుత్వ ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని, ఇతర దేశాలకు అందిస్తున్నాయని ‘ఎయిడ్‌డేటా’ పేర్కొంది.
చైనా నుంచి భారత కంపెనీలకు అందిన రూ. 1.6 లక్షల కోట్ల రుణాల్లో చాలా వరకు విద్యుత్, ఆర్థిక రంగాల్లోని కంపెనీలకే అందాయి.
Updated Date - Nov 28 , 2025 | 06:53 AM