Mississauga Graffiti Arrest: భారతీయులను అవమానిస్తూ గోడలపై రాతలు..కెనడాలో మహిళ అరెస్టు
ABN, Publish Date - Oct 16 , 2025 | 01:22 PM
మిస్సిసాగాలో భారతీయులను అవమానిస్తూ గోడలపై విద్వేషపూరిత రాతలు రాసిన మహిళను తాజాగా అరెస్టు చేశారు. అనంతరం 5 వేల డాలర్ల పూచీకత్తుపై ఆమెను విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని భారతీయులను ఎలుకలుగా సంబోధిస్తూ గోడలపై విద్వేషపూరిత రాతలను రాసిన ఓ మహిళను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో ఆమెపై కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో 5 వేల డాలర్ పూచీకత్తుపై నిందితురాలిని విడుదల చేశారు. ఈ మేరకు పీల్ రీజినల్ పోలీసు శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది (Mississauga Graffiti arrest).
మిస్సిసాగాకు చెందిన ప్రెడీ లుకర్ రిల్లోరాజా ఈ రాతలు రాసినట్టు పోలీసులు తెలిపారు. ఆమెను అరెస్టు చేసిన అనంతరం పూచీకత్తుపై విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మిస్సిసాగాలోని జీటీఏ టౌన్‌లో ఓ చోట ఆమె భారతీయులను అవమానిస్తూ గోడపై రాతలు రాశారు. సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగింది. ముస్లింలు, భారతీయులను ఉద్దేశిస్తూ ఆమె ఈ కామెంట్ చేశారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు అందడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను తాజాగా అరెస్టు చేశారు (Indian community Canada).
ఈ పరిణామంపై మిస్సిసాగా నగర కౌన్సిల్ సభ్యురాలు దీపికా దామెర్ల స్పందించారు. నిందితురాలిపై కేసు నమోదైనట్టు తెలిపారు. విద్వేష పూరిత చర్యలను ప్రభుత్వం సహించబోదని ఈ అరెస్టుతో స్పష్టమైన సందేశం వెళ్లిందని వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో కెనడాలో భారతీయులపై విద్వేష పూరిత ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. వలసలపై వ్యతిరేకత కారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. వలసలకు అత్యంత అనుకూల దేశంగా కెనడాకు ఇప్పటివరకూ పేరుంది. అయితే, దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులకు తోడు ట్రంప్ సంప్రదాయ వాద విధానాల ప్రభావం కూడా కెనడాపై పడింది.
వలసలపై అమెరికా అనుసరిస్తున్న కఠిన చర్యలు కెనడాపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కెనడా వారికి దక్కాల్సి ఉద్యోగాలు వలసొచ్చిన వారు చేజిక్కించుకుంటున్నారన్న విమర్శలు కెనడాలో పెరిగాయి. సొంత ఇళ్లు, అద్దె ఇళ్ల ధరలు పెరగడానికి వలసలే కారణమన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి.
ఇవి కూడా చదవండి:
రష్యా చమురు కొనబోమని మోదీ హామీ ఇచ్చారు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. భారత్ ర్యాంకు ఎంతంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 16 , 2025 | 02:29 PM