Death Penalty to Sheikh Hasina in Riot Case: షేక్ హసీనాకు మరణశిక్ష
ABN, Publish Date - Nov 18 , 2025 | 04:10 AM
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నాయకురాలు షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ మరణశిక్ష విధించింది.....
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ సంచలన తీర్పు
ఢాకా, నవంబరు 17 : బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న నాయకురాలు షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్(ఐసీటీ) మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడ్డారని ఈ తీర్పు సందర్భంగా ట్రైబ్యునల్ ఆక్షేపించింది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలను హసీనా ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేసినట్టు నమోదైన అభియోగాలపై దాదాపు నెలరోజులపాటు విచారణ జరిగింది. జస్టిస్ మొహమ్మద్ గొలామ్ మొర్తుజా మజుందార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చింది. ఇవే ఆభియోగాలపై హోంశాఖ మాజీ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, పోలీసు శాఖ మాజీ చీఫ్ చౌధురీ అబ్దుల్లా-అల్-మామున్‌లను కూడా దోషులుగా ప్రకటించింది. వీరిలో కమల్‌కు మరణశిక్షను; టైబ్యునల్‌ను, దేశ ప్రజలను క్షమాపణలు కోరిన అబ్దుల్లాకు ఐదేళ్ల శిక్షను విధించింది. గత ఏడాది ఆందోళనకారుల హత్యలకు దేశవ్యాప్తంగా ఈ ముగ్గురు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని, అమలుచేశారని ట్రైబ్యునల్ తేల్చింది. అల్లర్లను ప్రేరేపించడం...ఆందోళనకారుల హత్యలకు ఆదేశాలు...విద్యార్థులపై హింసను ఆపడానికి చర్యలు తీసుకోకపోవడం వంటి మూడు కారణాల రీత్యా హసీనాను దోషిగా ప్రకటిస్తున్నామని, ఆమె నేరాలకు మరణశిక్ష తప్ప మరే దండనా సరిపోదని ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ‘‘విద్యార్థుల డిమాండ్లను, వారి ఉద్యమాన్ని నాటి హసీనా ప్రభుత్వం లక్ష్యపెట్టకపోగా, ‘రజాకార్లు’ అంటూ నిందార్థ పదాలను ఉపయోగించింది. ఆందోళనకారులు గుమిగూడిన స్థలాలను డ్రోన్ల ద్వారా గుర్తించి హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలతో దాడులు చేసి చంపివేయాలంటూ శాంతిభద్రతల విభాగాలను హసీనా ఆదేశించగా, ఆ ఆదేశాలను అప్పటి హోం మంత్రి కమల్, నాటి పోలీస్ చీఫ్ అబ్దుల్లా అమలుచేశారు. విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉండటం హసీనా,కమల్‌ల దోషిత్వాన్ని సూచిస్తోంది’’ అని ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో ఢాకాలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు, పౌరులపై ఎవరు దాడులు చేసినా కాల్చివేయాలంటూ ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
హసీనాను భారత్ అప్పగించాలి: బంగ్లాదేశ్
మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ భారత్ ప్రభుత్వాన్ని బంగ్లా సర్కారు కోరింది. నేరస్థుల పరస్పర అప్పగింత ఒప్పందం ప్రకారం తమ విజ్ఞప్తిని భారత్ పాటించి తీరాల్సిందేనని పేర్కొంది. ట్రైబ్యునల్ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు.
మా వైఖరిలో మార్పు ఉండదు
బంగ్లాదేశీయులకు ఏది మంచి చేస్తుందో, దానికే కట్టుబడి ఉంటామని భారత్ పునరుద్ఘాటించింది. షేక్ హసీనాకు మరణశిక్ష ప్రకటించడం, ఆ తర్వాతి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. ఒక పొరుగుదేశంగా.. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం నెలకొనాలని కోరుకుంటున్నామంది.
తీర్పును గుర్తించను: షేక్ హసీనా
ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఉగ్రవాద శక్తుల్లో దాగిన అనాగరిక, హత్యాపూరిత ఉద్దేశాలను ఈ తీర్పు బయటపెట్టిందని హసీనా విమర్శించారు. నిష్పక్షపాత విచారణ జరగలేదని, తమ వాదనలు వినిపించడానికి ట్రైబ్యునల్ అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఆందోళనకారుల హత్యలకు తానుగానీ, ప్రభుత్వంలోని నాయకులుగానీ ఆదేశించలేదని పేర్కొన్నారు. తీర్పును తాను గుర్తించడం లేదన్నారు. సరైన న్యాయస్థానంలో విచారణ జరగాలని, హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని యూనస్ ప్రభుత్వాన్ని తాను పదేపదే కోరినట్లు హసీనా తెలిపారు. కాగా, ఆమె పెళ్లి రోజునే(నవంబరు 17) ట్రైబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించడం విశేషం.
నాడూ భారత్‌లోనే ఆశ్రయం
1975లో తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్‌ను, తల్లిని, కుటుంబసభ్యులను హత్యచేసిన అర్ధరాత్రి సైనిక తిరుగుబాటు నుంచి హసీనా తప్పించుకున్నారు. ఆ మారణకాండలో మొత్తం 36 మందిని అదే నివాసంలో ఊచకోత కోశారు. ఆ ఘటన తర్వాత హసీనా తన భర్త, పిల్లలు, సోదరి రెహానాతో కలిసి భారత్‌కు చేరుకుని 1981 వరకు ప్రవాస జీవితం గడిపారు. ఆమె భారత్‌లో ఉండగానే ఆమె తండ్రి పార్టీ అయిన అవామీ లీగ్ కార్యకర్తలు హసీనాను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకొన్నారు. ఇప్పుడు కూడా గత ఏడాది ఆగస్టు 4వ తేదీ నుంచి హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
Updated Date - Nov 18 , 2025 | 04:10 AM