Mohammad Yunus: బంగ్లా మ్యాప్‌లో ఈశాన్య రాష్ట్రాలు
ABN, Publish Date - Oct 28 , 2025 | 03:47 AM
బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ మరో దౌత్య వివాదానికి తెరలేపారు. అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్న ఆయన తాజాగా భారత...
భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన యూనస్.. ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకంపై వక్రీకరించిన మ్యాప్
ఈ పుస్తకం పాక్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 27: బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ మరో దౌత్య వివాదానికి తెరలేపారు. అధికారం చేపట్టినప్పటి నుంచి భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్న ఆయన తాజాగా భారత ఈశాన్య ప్రాంత సమస్యలోకి అడుగుపెట్టడం ద్వారా మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపిస్తూ ఉన్న వివాదాస్పద మ్యాప్‌ను పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్‌పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల ఢాకాలో యూన్‌సతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ అనే పుస్తకాన్ని యూనస్.. మీర్జాకు బహూకరించారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను యూనస్ ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఆ పుస్తకం కవర్‌పేజీపై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించడం తాజా వివాదానికి కారణమైంది. ఈ మ్యాప్ భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంలో భాగంగా చూపించడం భారత్ ఆగ్రహానికి కారణమైంది. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ చర్యలపై సోషల్ మీడియాలో విశ్లేషకులు, జర్నలిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
యూనస్.. ఇదే తొలిసారి కాదు
ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా పర్యటన సందర్భంగా.. ‘ఈశాన్య భారతదేశం భూపరివేష్టితమై ఉన్నందున.. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే ఏకైక సంరక్షకులం’ అని అన్నారు. అయితే దీనిపై భారత్ అప్పట్లోనే దీటుగా బదులిచ్చింది. భారతదేశ ఈశాన్య ప్రాంత ప్రాముఖ్యతను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌తోపాటు భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలతో సరిహద్దు సంబంధం ఉన్న ఈ ప్రాంతం బిమ్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అలాగే బంగ్లాదేశ్ వస్తువులను భారత భూభాగం నుంచి భూటాన్, నేపాల్, మయన్మార్‌లకు తరలించడానికి అనుమతించే ట్రాన్స్‌షి్‌పమెంట్ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది.
జకీర్ నాయక్‌కు ఆహ్వానం!
ఢాకా ఉగ్రదాడి తర్వాత తొమ్మిదేళ్లకు వివాదాస్పద మతబోధకుడు, భారత్ నుంచి పరారైన జకీర్ నాయక్ నవంబరు 28నుంచి సుమారు నెల రోజులపాటు బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు యూనస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ వద్ద ఉగ్రదాడి జరిగింది. యూట్యూబ్‌లో జకీర్ నాయక్ ప్రసంగాలు విని ప్రేరణ పొందానని ఆ ఉగ్రదాడి నిందితుల్లో ఒకరు దర్యాప్తు అధికారులకు వెల్లడించిన నేపథ్యంలో నాటి షేక్ హసీనా ప్రభుత్వం జకీర్ నాయక్ నేతృత్వంలోని పీస్ టీవీ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిషేధించింది. విద్వేష ప్రసంగాలతో మతాల మధ్య చిచ్చు పెట్టారంటూ అతనిపై భారత్‌లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Updated Date - Oct 28 , 2025 | 03:47 AM