Taliban Press Meet: మరో తాలిబాన్ ప్రెస్ మీట్.. మహిళా జర్నలిస్టులకు ఆహ్వానాలు
ABN, Publish Date - Oct 12 , 2025 | 01:40 PM
దాదాపు వారంపాటు భారత్‌లో పర్యటించేందుకు ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకీ వచ్చారు. అయితే, అక్టోబర్ 10న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా జర్నలిస్టులకు పిలుపు అందకపోవడం విమర్శలకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు చోటు దక్కకపోవడంతో అఫ్ఘాన్ మంత్రి ముత్తకీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబాన్లు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆదివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి స్త్రీ, పురుష బేధం లేకుండా జర్నలిస్టులను అందరినీ ఆహ్వానించారు (Taliban Press Meet).
దాదాపు వారంపాటు భారత్‌లో పర్యటించేందుకు ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకీ వచ్చారు. అయితే, అక్టోబర్ 10న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా జర్నలిస్టులకు పిలుపు అందకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రముఖ జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, మహిళా హక్కుల సంఘాలు విమర్శలు గుప్పించారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, భారతీయ విమెన్స్ ప్రెస్ కోర్ గ్రూప్ కూడా మండిపడింది. ఇది తీవ్ర వివక్షాపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ఏ రకంగానూ సమర్థించుకోకూడదని కుండ బద్దలు కొట్టింది.
ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు ఎక్కువవడంతో తాలిబాన్లు దిద్దుబాటు చర్యలకు దిగారు. మీడియా వారందరికీ తాజాగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో అందరికీ చోటు ఉందని అన్నారు. అఫ్ఘానిస్థాన్ అధికార పగ్గాలను 2021లో తాలిబన్లు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత తొలిసారిగా తాలిబాన్ మంత్రి ముత్తకీ భారత పర్యటనకు వచ్చారు. అఫ్ఘాన్‌లో తమ పాలనకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న తాలిబాన్లు.. భారత్‌తో సహా పలు దేశాలతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా జులైలో తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశంగా నిలిచింది.
మరోవైపు పాక్, అప్ఘాన్ మధ్య తాజాగా ఘర్షణలు భగ్గుమన్నాయి. ఇటీవల కాబుల్‌పై పాక్ దళాల వైమానిక దాడికి ప్రతిగా తాలిబాన్లు సరిహద్దు వెంబడి పాక్ సైన్యంపై దాడికి దిగారు. ఈ దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించారు. పలు పాక్ ఔట్‌పోస్టులను కూడా తాలిబాన్లు స్వాధీనం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడం సిగ్గుమాలిన చర్య.. మచాడోపై విమర్శల వెల్లువ
అలా కావాలని చేయలేదు.. డిల్లీ ప్రెస్‌మీట్‌లో మహిళలా జర్నలిస్టులు లేకపోవడంపై తాలిబాన్ల వివరణ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 12 , 2025 | 03:41 PM