Share News

Taliban on Presser Row: కావాలని చేయలేదు.. డిల్లీ ప్రెస్‌మీట్‌పై తాలిబన్ల వివరణ..

ABN , Publish Date - Oct 11 , 2025 | 06:30 PM

అఫ్గానిస్థాన్ మంత్రి ముత్తకీ పాల్గొన్న ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు జారీ చేయడంతో కొందరికి పాస్‌లు అందలేదని తాలిబాన్లు తాజాగా వివరణ ఇచ్చారు.

Taliban on Presser Row: కావాలని చేయలేదు.. డిల్లీ ప్రెస్‌మీట్‌పై తాలిబన్ల వివరణ..
Taliban On Press Meet Row

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో అఫ్గానిస్థాన్ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్త్రీలపై ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ కూడా వివరణ ఇచ్చింది. తాజాగా తాలిబాన్లు కూడా దీనిపై స్పందించారు. ఇది అనుకోకుండా జరిగిన పరిణామమని తాలిబాన్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు (Taliban on Press Meet Row).

ఢిల్లీ ప్రెస్ మీట్‌కు సంబంధించి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు పంపామని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. మహిళలపై ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. పాస్‌లు పరిమితంగా ఉండటంతో కొందరికి ఆహ్వానాలు అందలేదని అన్నారు. కొందరు పురుష జర్నలిస్టులకు కూడా పాస్‌లు పంపించలేదని తెలిపారు. ప్రెస్ మీట్‌లో మహిళలు లేకపోవడం అనేది విధానపరంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

అఫ్గానిస్థాన్ మంత్రి ముత్తకీ కాబుల్‌లోని తన కార్యాలయంలో నిత్యం మహిళలను కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తుంటారని తెలిపారు. మహిళా జర్నలిస్టులకు తనూ ఇంటర్వ్యూలు ఇస్తుంటానని తాలిబాన్ ప్రతినిధి అన్నారు.


ఇక ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ఢిల్లీ పత్రికా సమావేశం ఏర్పాటులో తమ పాత్ర ఏమీ లేదని తెలిపింది. ముంబైలోని అఫ్గాన్ ఎంబసీలో కొందరు జర్నలిస్టులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయని తెలిపింది. ఎంబసీ పరిసరాలు భారత ప్రభుత్వ పరిధిలోకి రావని కూడా పేర్కొంది.

అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్లు షరియా చట్టం ప్రకారం పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ చట్టాలకు అనుగుణంగా లేని అనేక విధానాలకు వారు ముగింపు పలికారు. విద్య, ఉద్యోగాల్లో మహిళల పాత్రను పరిమితం చేసే ఆంక్షలు విధించారు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు, తమ పాలనకు అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు కోసం తాలిబాన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చైనాతోపాటు యూఏఈతో కూడా కొంత మేర దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ఇక జులైలో రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించింది. తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశంగా నిలిచింది.


ఇవి కూడా చదవండి:

మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ

అప్ఘాన్ మంత్రి ప్రెస్‌మీట్‌.. మహిళా జర్నలిస్టులకు దక్కని ఆహ్వానం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2025 | 07:51 PM