Share News

Afghan Minister Press Conference: అప్ఘాన్ మంత్రి ప్రెస్‌మీట్‌.. మహిళా జర్నలిస్టులకు దక్కని ఆహ్వానం

ABN , Publish Date - Oct 10 , 2025 | 09:25 PM

అప్ఘానిస్థాన్ మంత్రి ముత్తకీ తాజాగా ఢిల్లీలో జరిపిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Afghan Minister Press Conference: అప్ఘాన్ మంత్రి ప్రెస్‌మీట్‌.. మహిళా జర్నలిస్టులకు దక్కని ఆహ్వానం
Afghan FM Muttaqi

ఇంటర్నెట్ డెస్క్: అప్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తకీ ఢిల్లీలో తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదానికి దారితీసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేవలం పురుష జర్నలిస్టులకే ఆహ్వానాలు అందడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అనంతరం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు (Afghan Minister Press - No Female Journalists).

మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై ప్రస్తుతం పలువురు సీనియర్ విలేకరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిర్భీతిగా స్త్రీవివక్షను ప్రదర్శించడం భారత ప్రజాస్వామ్య విలువలకు అవమానమని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సమావేశాన్ని పురుష జర్నలిస్టులు బాయ్‌కాట్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ కూడా స్పందించారు. ‘మన దేశానికి ఏం చేయాలో మన గడ్డపై నిలబడి చెప్పేందుకు వారెవరు. వారి వివక్ష పూరిత ఎజెండాను మనపై ఎలా రుద్దుతారు?’ అని మండిపడ్డారు. అప్ఘానిస్థాన్‌లో తాలిబాన్లు స్త్రీలను అణివేస్తున్న విషయం తెలిసిందే. విద్య, ఉద్యోగం, ఇతర బహిరంగ ప్రదేశాలకు వాళ్లను దూరం చేస్తూ అనేక కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.


పాక్, భారత్ ఉద్రిక్తతల నేనథ్యంలో అప్ఘాన్ మంత్రి ముత్తకీ భారత్‌లో పర్యటిస్తున్నారు. 2021లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చాక ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచీ మహిళలను అణచివేసేలా పలు నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. మహిళల హక్కుల ఉల్లంఘనలు అక్కడ సంక్షోభ స్థాయికి చేరుకున్నాయన్న ఆందోళన సర్వత్రా పెరిగింది. ఈ విషయంపై జులైలోనే ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అప్ఘానిస్థాన్‌లో మహిళల అణచివేత వ్యవస్థాగతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధానాలకు తక్షణం ముగింపు పలకాలని తాలిబాన్‌లను కోరింది. విద్య, ఉద్యోగం, ప్రజాజీవితంలోకి వారినీ అనుమతించాలని స్పష్టం చేసింది. అయితే, తాలిబాన్లు మాత్రం యథాతథంగా తమ విధానాలను కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్

మమ్మల్ని టెస్ట్ చేయొద్దు.. భారత్ గడ్డపై నుంచి పాక్‌కు అప్ఘాన్ మంత్రి వార్నింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 10 , 2025 | 09:27 PM